కర్ణాటకలోని ధార్వాడ్‌లో ఓ డాక్టర్ హత్యకు గురయ్యారు. ఆయన 8 ఏళ్ల కుమారుడు సైతం కత్తిపోట్లకు గురయ్యాడు. తండ్రీ కొడుకులు రక్తపు మడుగులో పడి ఉండగా.. డాక్టర్ భార్య పక్కనే బెడ్‌పై పడుకొని ఫోన్ చూస్తూ కనిపించింది. భర్తకు ఫోన్ చేసిన స్నేహితులు, బంధువులకు ఆయన నిద్రపోతున్నారని.. డ్యూటీకి వెళ్లారని ఆమె అబద్ధం చెప్పింది. అయితే ఈ ఘటనలో పిల్లాడు ప్రాణాలతోనే ఉండటంతో పోలీసులు అతణ్ని హాస్పిటల్‌కు తరలించారు.హుబ్లీ-ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్. సతీష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ కిరణ్ హొన్నన్‌వార్ తన భార్య ప్రియాంకతో కలిసి నగరంలోని ఓ అపార్ట్‌మెంట్లో నివాసం ఉంటున్నారు. ఆయన ధార్వాడ్‌లోని చిరాయు ఆసుపత్రిలో అనస్థిషీయా వైద్యుడిగా పని చేసేవారు. ఆయన భార్య ప్రియాంక కూడా డాక్టరే. ఎంబీబీఎస్ చేసిన ఆమె.. ఆప్తమాలజీలో ఎంఎస్ పూర్తి చేశారు. వీరికి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. కిరణ్ కుటుంబం పవన్ హైస్కూల్‌కు ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్లోని ఆరో అంతస్థులో నివాసం ఉంటోంది. కిరణ్ కుటుంబ సభ్యులు తరచుగా అక్కడికి వచ్చి వెళ్తుండే వారు.భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందా.. మరో కారణమా తెలీదు కానీ.. కిరణ్ రక్తపు మడుగులో ప్రాణాలు వదిలి కనిపించారు. ఆయన 8 ఏళ్ల కుమారుడు సైతం గాయాల కారణంగా స్పృహ కోల్పోయి పక్క గదిలో కనిపించాడు.మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం సమయంలో కిరణ్‌కు స్నేహితులు, బంధువులు ఫోన్లు చేశారు. ఈ కాల్స్‌ మాట్లాడిన ప్రియాంక.. తొలుత ఆయన రెస్ట్ తీసుకుంటున్నారని, తర్వాత డ్యూటీ కోసం బయటకు వెళ్లారని చెప్పింది. బుధవారం సాయంత్రం కుటుంబ సభ్యులు ఫ్లాట్‌కి వెళ్లగా.. డాక్టర్ కిరణ్, ఆయన కుమారుడు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించారు. ప్రియాంక మాత్రం బెడ్ మీద పడుకొని ఫోన్ చూస్తూ కనిపించింది.పక్కన ఫ్లాట్‌లలో ఉండేవారు బుధవారం ఉదయం డాక్టర్ ఫ్యామిలీతో మాట్లాడటానికి ప్రయత్నించారు. అయితే తాను మాత్రమే ఇంటి లోపల ఉన్నానని, తన భర్త బయటకు వెళ్లారని ప్రియాంక వారితో చెప్పింది.ఇరుగుపొరుగు వారు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పిల్లాడు ప్రాణాలతోనే ఉండటాన్ని గమనించి చికిత్స కోసం వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి పరిస్థితిని గమనించిన పోలీసులు.. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో దంపతులతోపాటు బాబు మాత్రమే ఉన్నాడని.. ఇంట్లోకి వేరే వాళ్లు వచ్చిన ఆనవాళ్లు లేవని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.కిరణ్ కుటుంబ సభ్యులు ప్రియాంకనే ఈ హత్య చేసిందని, కొడుకును కూడా చంపేందుకు ప్రయత్నించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అసలు ఆ ఫ్లాట్‌లో ఏం జరిగింది..? ఆ పిల్లాడికి కత్తి గాయాలు ఎప్పుడు అయ్యాయి అనే విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేపడతామని.. ప్రియాంక ఎవరితో మాట్లాడింది? ఏం మాట్లాడింది? అసలు ఏం జరిగింది అనే విషయాలను తెలుసుకుంటామని పోలీసు కమిషనర్ చెప్పారు. ప్రియాంక సైతం ఆత్మహత్యాయత్నం చేసిందనే అనుమానంతో ఆమెను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.