భోగాపురం ఎయిర్‌పోర్టు రెడీ.. నెల రోజుల్లో విమానాల రాకపోకలు.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం () ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మరో నెల రోజుల్లో విమాన కార్యకలాపాలను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఉడాన్ 2.0 పథకం అమలుపై నిర్వహించిన వర్క్‌షాప్ తర్వాత మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఓపెనింగ్ తేదీ ఖరారైన వెంటనే ప్రారంభోత్సవం నిర్వహించి విమాన సర్వీసులను ప్రారంభిస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఇక భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఇటీవల కేంద్ర హోంశాఖ కీలక గుర్తింపు కూడా రావడం గమనార్హం. 'ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్-2025' పరిధిలోకి ఈ భోగాపురం విమానాశ్రయాన్ని చేర్చుతూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో దేశంలోని కేటగిరీ-1 ఇమిగ్రేషన్ చెక్‌పోస్ట్‌ల జాబితాలో భోగాపురం ఎయిర్‌పోర్టు 39వ విమానాశ్రయంగా చోటు దక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భోగాపురం నుంచి నేరుగా ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు నడిపేందుకు చట్టపరంగా మార్గం సుగమం అయింది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఇమిగ్రేషన్ సేవలు కలిగిన నాలుగో ఎయిర్‌పోర్టుగా భోగాపురం విమానాశ్రయం నిలవనుంది. విదేశీ ప్రయాణికుల ఎంట్రీ, ఎగ్జిట్ ప్రక్రియలను నిర్వహించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు ఈ విమానాశ్రయంలో అందుబాటులోకి రానున్నాయి.అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన ఈ భోగాపురం విమానాశ్రయంలో 3800 మీటర్ల పొడవైన రన్‌వేను ఏర్పాటు చేశారు. ఎయిర్‌బస్, బోయింగ్ వంటి భారీ విమానాలు కూడా సులభంగా ల్యాండ్ అయ్యేలా ఈ రన్‌వేను రూపొందించారు. రెండు అంతస్తుల్లో 79 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రయాణికుల టెర్మినల్ నిర్మించారు. ఇందులో చెక్ ఇన్ కౌంటర్లు, ఇమిగ్రేషన్, భద్రతా తనిఖీలు, బ్యాగేజీ స్క్రీనింగ్, వాణిజ్య స్థలాలు, ఫుడ్ కోర్టులు, సెల్ఫ్ సర్వీస్ కియోస్కులు వంటి అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అదనంగా 25 వేల టన్నుల సామర్థ్యంతో కార్గో టెర్మినల్ కూడా ఏర్పాటు చేశారు. ఈ భోగాపురం విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్రలో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఎగుమతులకు మరింత ఊతం లభించనుందని అధికారులు భావిస్తున్నారు.