తెలంగాణలో తాగునీటి పరిస్థితి రోజురోజుకూ తీవ్ర ఆందోళనకరంగా మారుతోంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడం.. కారణంగా రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోవడంతో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. భూగర్భ జలమట్టాలు కూడా క్రమంగా పడిపోతుండటంతో రానున్న నెలల్లో తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిషన్ భగీరథ పథకం కింద గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించే 123 శుద్ధి కేంద్రాలకు రాష్ట్రంలోని 29 ప్రధాన జలాశయాలు ఆధారంగా ఉన్నాయి. ఈ 29 జలాశయాల మొత్తం నిల్వ సామర్థ్యం 1,059 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం కేవలం 333.44 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. గతేడాది ఇదే సమయంలో 522.31 టీఎంసీల నిల్వలు ఉండగా.. గతంతో పోలిస్తే ఈసారి పరిస్థితి మరింత దిగజారినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఉత్తర తెలంగాణలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీకి పైన వినియోగించదగిన నీరు కేవలం 3 టీఎంసీలే మిగిలి ఉండగా.. ప్రతి నెల తాగునీటి అవసరాలకు సుమారు అర టీఎంసీ అవసరం అవుతోంది. లోయర్ మానేరు, ఎల్లంపల్లి, కడెం, జూరాల, నాగార్జునసాగర్, నిజాంసాగర్, సింగూర్, కోయిల్‌సాగర్, రామన్‌పాడు, అక్కంపల్లి, వైరా, ఉదయసముద్రం, ధర్మసాగర్ వంటి జలాశయాల్లోనూ నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలు ఈ జలాశయాలపై ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న నిల్వలతో మంజీరా, సింగూర్, గోదావరి వ్యవస్థల నుంచి సెప్టెంబర్ చివరి వరకు మాత్రమే తాగునీరు అందించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ అవసరాల కోసం సింగూర్‌లో కనీసం 16 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖకు సూచనలు వెళ్లాయి.ఇదిలా ఉండగా భూగర్భ జలాల పరిస్థితి కూడా దిగజారుతోంది. జూన్ నాటికి రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం 9.46 మీటర్ల లోతుకు పడిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బోర్లను మరింత లోతుగా తవ్వడం, అవసరమైన చోట కొత్త బోర్లు ఏర్పాటు చేయడం, వర్షపు నీటి సంరక్షణ చర్యలను వేగవంతం చేయడం వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రభుత్వం చేపడుతోంది. అయితే భారీ వర్షాలు త్వరలో కురవకపోతే.. కృష్ణా-గోదావరి జలాశయాల్లో నిల్వలు పెరగకపోతే తెలంగాణలో రానున్న నెలల్లో తాగునీటి సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.