ఐపీఎల్ చరిత్రలోనే విజయవంతమైన కోచ్‌ల్లో ఒకరైన చెన్నై సూపర్ కింగ్స్‌తో తన అనుబంధాన్ని ముగించారు. ఏకంగా 18 ఏళ్లపాటు సీఎస్కేతో కలిసి పని చేసిన ఆయన చెన్నై హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నారు. తాము, ఫ్లెమింగ్ ఉమ్మడిగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు సోమవారం ప్రకటించింది.చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం సంధి దశలో ఉంది. సీఎస్కే‌కు క్రేజ్ తీసుకొచ్చిన ధోనీ కెరీర్ చరమాంకంలో ఉంది. దీంతో రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. గత మూడు సీజన్లలో చెన్నై ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయింది. 2024, 2025, 2026 సీజన్లలో లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. చెన్నై సూపర్ కింగ్స్ సిస్టర్ ఫ్రాంచైజీ అయిన టెక్సాస్ సూపర్ కింగ్స్ సైతం ఈ ఏడాది మేజర్ లీగ్ క్రికెట్‌లో చివరి స్థానానికి పరిమితమైంది. ఈ జట్టు బాధ్యతలను కూడా ఫ్లెమింగ్ పర్యవేక్షించేవారు. ఫ్రాంచైజీకి చెందిన జట్లు వరుసగా విఫలం అవుతున్న నేపథ్యంలో ఫ్లెమింగ్‌తో అనుబంధాన్ని సూపర్ కింగ్స్ తెంచుకుందని భావిస్తున్నారు. ఐపీఎల్‌తోపాటు అమెరికా, సౌతాఫ్రికాల్లోని సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీల బాధ్యతల నుంచి కూడా ఫ్లెమింగ్ తప్పుకున్నారు.హెడ్ కోచ్‌గా అసాధారణ విజయాలు..2008లో ఐపీఎల్ తొలి సీజన్లో ఆటగాడిగా చెన్నై సూపర్ కింగ్స్‌తో అనుబంధాన్ని మొదలుపెట్టిన ఫ్లెమింగ్.. 2009 సీజన్లో హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. 2026 సీజన్ ముగిసే వరకు ఆయన సీఎస్కే ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 17 ఏళ్లకుపైగా చెన్నై హెడ్‌ కోచ్‌గా వ్యవహరించిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్.. బలమైన ఆధునిక క్రికెట్ సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఫ్లెమింగ్ మార్గదర్శకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు ఐపీఎల్ టైటిల్స్ సాధించడంతోపాటు రెండు ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లు గెలుపొందింది. 12సార్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన సీఎస్కే పదిసార్లు ఫైనల్‌కు చేరుకుంది.ధోనీ-ఫ్లెమింగ్ బ్లాక్ బస్టర్ కాంబో..కోచ్‌ ఫ్లెమింగ్, కెప్టెన్ ధోనీ మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరికీ మేనేజ్‌మెంట్ పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఈ స్థాయిలో విజయాలు సాధించగలిగింది. ఫ్రాంచైజీ క్రికెట్లో ఆటగాళ్లు, సహాయక సిబ్బందిపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. కానీ ధోనీ, ఫ్లెమింగ్ కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వీరిద్దరూ ఒకరి నిర్ణయాలను మరొకరు గౌరవిస్తూ.. తమ పరిధులను అర్థం చేసుకుంటూ.. ప్రశాంతంగా పని చేసుకొని పోయేవారు. ఒకరిపై మరొకరికి అపారమైన నమ్మకం ఉండేది. సీఎస్కే తరఫున ఆడిన చాలా మంది ఆటగాళ్లు అక్కడి డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం గురించి ఇప్పటికీ గొప్పగా చెబుతుంటారు.లైఫ్ టైం మెమొరీస్ ఉన్నాయి: ఫ్లెమింగ్‘‘పద్దెనిమిదేళ్లు అనేది స్పోర్ట్స్‌లో లైఫ్ టైమ్, పూర్తి కృతజ్ఞతా భావంతో నేను వీడ్కోలు పలుకుతున్నా. సీఎస్కేతో నేను గడిపిన కాలం నా కోచింగ్ కెరీర్లోనే ఎంతో గొప్పది. మనం సాధించిన ప్రతి దానికీ నేను గర్విస్తున్నాను. మనం ఎన్నో మర్చిపోలేని విజయాలను ఆస్వాదించాం, ఎన్నో క్లిష్ట పరిస్థితులను అధిగమించాం. జీవితాంతం నాతో నిలిచిపోయే జ్ఞాపకాలను సంపాదించుకున్నాను’’ అని చెన్నై హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్న సందర్భంగా స్టీఫెన్ ఫ్లెమింగ్ వ్యాఖ్యానించారు.ఫ్లెమింగ్‌పై ప్రశంసలు..ఫ్లెమింగ్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్న వేళ సీఎస్కే ఫ్రాంచైజీ యజమాని రూపా గురునాథ్, మేనేజింగ్ డైరెక్టర్ కాశీ విశ్వనాథ్ ఆయనపై ప్రశంసలు గుప్పించారు. ఎలా ఆడాం అనేదే కాకుండా ఓ ఫ్రాంచైజీగా ఎలాంటి స్థానానికి చేరుకోవాలనుకున్నామో నిర్దేశించడంలో ఫ్లెమింగ్ ఎంతో తోడ్పాటును అందించారని కాశీ విశ్వనాథ్ తెలిపారు. నిలకడ, అణకువ, జట్టు ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వడం అనే విలువలపై ఆధారపడిన ఓ గొప్ప సంస్కృతిని ఫ్లెమింగ్ నిర్మించారంటూ సీఎస్కే ఎండీ కొనియాడారు.ఫ్లెమింగ్ స్థానంలో బదానీ లేదా ద్రవిడ్..?చెన్నై హెడ్ కోచ్ పదవి నుంచి ఫ్లెమింగ్ తప్పుకోవడంతో.. ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే విషయమై చర్చ జరుగుతోంది. ఫ్లెమింగ్‌ స్థాయికి సరితూగే వ్యక్తిని ఎంపిక చేయడం మేనేజ్‌మెంట్‌కు కత్తి మీద సాము లాంటిదని చెప్పొచ్చు. సీఎస్కే హెడ్ కోచ్ రేసులో ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమంగ్ బదానీ ముందు ఉన్నట్లు తెలుస్తోంది. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరు కూడా వినిపిస్తోంది. కొద్ది సీజన్ల క్రితం సీఎస్కే‌లోని కీలక వ్యక్తులు ద్రవిడ్‌ను సంప్రదించారని కూడా సమాచారం. ఫ్లెమింగ్ స్థానంలో ధోనీ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపడతాడని.. శాంజూ శాంసన్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.