ఆంధ్రప్రదేశ్‌‌లో కొవిడ్ కేసులు మరోసారి టెన్షన్ పెడుతున్నాయి.. కొద్దిరోజులుగా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. తాజాగా కొవిడ్ కేసులపై వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో 12 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని.. బాధితుల్లో నలుగురు చనిపోయినట్లు ప్రకటించారు. చనిపోయినవారు కడప జిల్లాలో ముగ్గురు, కాకినాడ జిల్లాటో ఒకరు మృతిచెందారని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి జి వీరపాండియన్‌ తెలిపారు. కొవిడ్ పాజిటివ్‌గా తేలి చనిపోయిన నలుగురికి తీవ్ర అనారోగ్య సమస్యలున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 12 కేసుల్లో కడప జిల్లాలో ఎనిమిది, గుంటూరులో రెండు, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కక్కటి చొప్పున నమోదయ్యాయని వీరపాండియన్ తెలిపారు. కొవిడ్ పాజిటివ్ తేలినవారికి సన్నిహితంగా మెలిగిన వారు ఇద్దరు ఉన్నారన్నారన్నారు. రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని.. ముందు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.. ఒకవేళ అనుమానిత లక్షణాలుంటే ఆసుపత్రులకు వెళ్లాలన్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న కొవిడ్ కేసులుకు సంబంధించి వైరస్‌ జన్యు క్రమ స్వరూపాన్ని గుర్తించేందుకు ఐదు శాంపిల్స్ సేకరించి పుణెలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపినట్లు తెలిపారు. జూన్‌26 నుంచి జులై 16 వరకు నాలుగు జిల్లాల్లో 12 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 67మందికి చెందిన శాంపిల్స్ పరీక్షిస్తే.. 11 మందికి పాజిటివ్‌ తేలింది. కాకినాడ జిల్లాకు చెందిన వ్యక్తిని తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు సీఎంసీలో కొవిడ్‌ పాజిటివ్ తేలింది.విశాఖపట్నంలో కొవిడ్ పాజిటివ్ తేలిన వ్యక్తి కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌ వెళ్లి వచ్చారు. అప్పటి నుంచి జ్వరం, తలనొప్పితో బాధ పడుతుండటంతో ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేస్తే పాజిటివ్ తేలింది. ఆయన భార్యకు పరీక్ష నిర్వహించగా.. ఆమెకు నెగిటివ్‌ వచ్చింది. నమోదైన కొవిడ్ కేసులు కూడా వేర్వేరు జిల్లాల్లో ఉన్నాయి. పాజిటివ్ తేలినవారిలో ముగ్గురు హోం క్వారంటైన్, ఇద్దరికి ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు.. మరో ముగ్గురు కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీ ప్రభుత్వం డాక్టర్లు, ఆస్పత్రులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. దేశవ్యాప్తంగా జులై 1 నుంచి 339 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.. వీటిలో కేరళలో 115, కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39, అండమాన్‌లో 18, దిల్లీలో 18, రాజస్థాన్‌లో 12, ఇతర రాష్ట్రాల్లో మరికొన్ని కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.ఆంధ్రప్రదేశ్‌లో డీఎంహెచ్‌వోలు, జీజీహెచ్‌లు, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లను అలర్ట్ చేశారు. ఇప్పటికే అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ముందస్తు జాగ్రత్తగా ఆర్టీపీసీఆర్‌ టెస్టింగ్‌ కిట్లు, వీటీఎం, పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు, ఆక్సిజన్, మందులు సిద్ధం చేసుకోవాలని ఆదేశాలిచ్చారు. అంతేకాదు ఆసుపత్రుల్లో కొవిడ్‌ వార్డులు ఏర్పాటు చేసి, అవసరమైన యాంటీబయాటిక్స్, ఇతర సాధారణ మందులు అందుబాటులో ఉంచుతున్నారు. బీపీ, షుగర్‌ సహా దీర్ఘకాలిక సమస్యలున్నవారు వారు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తం మీద కొవిడ్ భయం మరోసారి జనాల్ని వణికిస్తోంది.