విశాఖపట్నంలో వెయ్యి పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించనున్నారు. అదానీ ఫౌండేషన్ ఈ ఆస్పత్రిని నిర్మించేందుకు ముందుకు వచ్చింది.. ఈ మేరకు అవసరమైన భూమిని ఏపీ ప్రభుత్వం కేటాయించింది. కాపులుప్పాడలో అదానీ ఫౌండేషన్ గ్రూప్‌నకు మొత్తం 60.29 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎకరా భూమిని రూ.15 లక్షల రాయితీ ధరతో కేటాయించారు. అదానీ గ్రూప్ అక్కడ వైద్య విద్యా సంస్థలు, అకాడమీలను ఏర్పాటు చేయనుంది. వీటిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కూడా ఉంది. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి చేసిన సిఫార్సు మేరకు ఈ భూ కేటాయింపులు చేసింది. అదానీ గ్రూప్‌నకు కేటాయించిన ఈ భూముల్ని 2023లో విశాఖ టెక్‌ పార్క్‌ లిమిటెడ్‌కు కేటాయించారు.. ఏపీ ప్రభుత్వం తాజాగా రద్దు చేసి వీరికి కేటాయించారు. అదానీ గ్రూప్ ఈ భూమిలో 13 ఎకరాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని వెయ్యి పడకల కెపాసిటీతో నిర్మించనుంది. మరో 15.8 ఎకరాల్లో మెడికల్ కాలేజీతో పాటుగా నర్సింగ్ కాలేజీ ప్లాన్ చేసింది. 4.18 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్కూల్, 9.7 ఎకరాల్లో స్కిల్‌ అకాడమీని ఏర్పాటు చేయనున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం రూ.713 కోట్లు, మెడికల్, నర్సింగ్‌ కాలేజీల కోసం రూ.104 కోట్లు, ఇంటర్నేషనల్‌ స్కూల్‌కి రూ.190 కోట్లు, స్కిల్‌ అకాడమీకి రూ.241 కోట్లు, గెస్ట్‌హౌస్, నివాసగృహాలకు రూ.235 కోట్లు, వైద్య పరికరాలకు రూ.419 కోట్లు, ఫర్నీచర్‌కు రూ.64 కోట్లు, ఐటీకి రూ.202 కోట్లు కేటాయించనున్నారు. అదానీ గ్రూప్ మొత్తం రూ.2,168 కోట్ల మేర ఖర్చు చేయనుంది.వీరపాండియన్‌‌కు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి బాధ్యతలుమరోవైపు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐఏఎస్ అధికారి వీరపాండియన్‌ను ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు ఏపీఎంఎస్‌ఐడీసీ వైస్‌ఛైర్మన్, ఎండీగా, డ్రగ్‌ కంట్రోల్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. ఇప్పటి వరకు ఈ అదనపు బాధ్యతల నుంచి సురేష్‌కుమార్‌ను రిలీవ్ చేశారు. అంతేకాదు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్, జాతీయ ఆరోగ్య మిషన్‌ ఎండీగానూ వీరపాండియన్‌ అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.