Retirement Plan: ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు, గ్రాట్యుటీ డబ్బులు పెద్ద మొత్తంలో చేతికి అందుతాయి. అయితే, ఈ డబ్బులను ఎలా కాపాడుకోవాలనేది పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు. చేతిలో పెద్ద మొత్తంలో నిధి ఉన్నప్పుడు దానిని సరైన చోట ఇన్వెస్ట్ చేయకపోతే ద్రవ్యోల్బణం వల్ల ఆ డబ్బు విలువ క్రమంగా తగ్గిపోతుంది. అలా ఓ వ్యక్తి నాలుగేళ్లలో రిటైర్ కాబోతూ తనకు వచ్చే పీఎఫ్, గ్రాట్యుటీ మొత్తం సొమ్ము రూ.1.15 కోట్లను ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం అని అడుగుతున్నారు. మరి ఈ ప్రశ్నకు సంబంధించిన సమాధానం తెలుసుకుందాం. ప్రశ్న: నాలుగేళ్లలో నేను రిటైర్ కాబోతున్నాను. ప్రావిడెంట్ ఫండ్ సేవింగ్స్‌లో రూ.95 లక్షలు ఉన్నాయి. గ్రాట్యుటీ రూ.20 లక్షల వరకు వస్తుందని అంచనా వేస్తున్నాను. నాకు ఎలాంటి అప్పులు లేవు. ఈ డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం ద్వారా నెలకు రూ.1 లక్ష ఆదాయం పొందవచ్చు?సమాధానం: 'సుమారు రూ.1.15 కోట్ల పదవీ విరమణ నిధితో, కేవలం ఈ నిధి నుండే నెలకు రూ. 1 లక్ష తీసుకోవడం కొంతకాలం పాటు సాధ్యమే. కానీ అది జీవితాంతం ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు అయ్యే అవకాశం లేదు. మీరు మొత్తం నిధిని ఒకే ఆదాయ వనరులలో పెట్టకూడదు. మీ ప్రస్తుత PF నిధి (రూ.95 లక్షలు) నాలుగేళ్లపాటు 8 శాతం వృద్ధి చెంది, రూ. 20 లక్షల గ్రాట్యుటీతో కలిపి మొత్తం సుమారు రూ. 1.56 కోట్లకు చేరుకుంటుంది. ఏటా రూ. 12 లక్షలు ఉపసంహరించుకోవడం అంటే రూ. 1.15 కోట్ల మూలధనంపై సుమారు 10.4 శాతం, రూ. 1.56 కోట్ల మూలధనంపై 7.67 శాతం చొప్పున అధిక ఉపసంహరణ రేటును కొనసాగించాల్సి ఉంటుంది.రాబోయే 2-3 ఏళ్ల ఖర్చుల కోసం 35 శాతం నుంచి 45 శాతం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, స్వల్పకాలిక డెట్ లేదా లిక్విడ్ ఫండ్స్ వంటి సురక్షితమైన ఆదాయ వనరులలో పెట్టుబడి పెట్టండి. 25 శాతం నుంచి 35 శాతం మొత్తాన్ని నాణ్యమైన డెట్ ఫండ్లలోనూ, మిగిలిన 25 శాతం నుంచి 35 శాతం మొత్తాన్ని బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ లేదా కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ వంటి వృద్ధి ఆధారిత పెట్టుబడులలో ఇన్వెస్ట్ చేయండి.ఇది ప్రస్తుతానికి స్థిరమైన నగదు ప్రవాహాన్ని అందించడంతో పాటు, కాలక్రమేణా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెట్టుబడి విలువను కాపాడుకోవడంలోనూ సహాయపడుతుంది. ఈ పెట్టుబడి నిధి సుమారు రూ. 1.15 కోట్లుగా ఉన్నట్లయితే నెలకు రూ. 65,000 వరకు, అదే రూ. 1.5 కోట్లకు చేరితే నెలకు సుమారు రూ. 87,000 వరకు ఆదాయాన్ని ఆశించడం వాస్తవిక లక్ష్యం అవుతుంది.' గెయినింగ్ గ్రౌండ్ ఇన్వెస్ట్‌మెంట్ సర్వీస్ నిపుణులు రవికుమార్ ఈటీ వెల్త్ రీడర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.