షాబాద్ నిందితుడు రాజ్‌కుమార్ వద్ద పోలీసులు లంచం ఆరోపణలు.. విజయశాంతి ఫైర్

Wait 5 sec.

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురు హత్యకు గురైన సంచలన ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ వద్ద పోలీసులు లంచాలు తీసుకుని.. బెయిల్‌పై విడుదలయ్యేలా చేశారంటూ వస్తున్న ఆరోపణలపై స్పందించిన ఆమె.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నిందితుడు చేసుకోవడంతో కేసు ముగిసిపోయిందని భావించకూడదని.. ఈ ఘటన వెనుక ఉన్న పోలీస్ వ్యవస్థ వైఫల్యాలపై కూడా సమగ్ర విచారణ జరగాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రాములమ్మ చేసిన పోస్ట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.గతంలో పోక్సో కేసులో అరెస్ట్ అయిన రాజ్‌కుమార్ అంత సులభంగా బెయిల్‌పై బయటకు రావడానికి గల కారణాలపై సమాధానం చెప్పాలని విజయశాంతి తన ఫేస్‌బుక్ పోస్టులో కోరారు. నిందితుడి నుంచి లంచం తీసుకుని కేసు నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు మీడియాలో రావడం మహిళల్లో తీవ్ర ఆందోళనకు కారణమైందని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు నిజమైతే పోలీసు వ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. రక్షించాల్సిన వ్యవస్థలోనే లోపాలు ఉంటే ఇలాంటి దారుణాలు పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే నిందితుడు బయటకు వచ్చి ఆరుగురు అమాయకుల ప్రాణాలు బలికావడానికి పరిస్థితులు ఏర్పడ్డాయనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోందని పేర్కొన్నారు. అందువల్ల ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుని వాస్తవాలను వెలికితీయాలని కోరారు.మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ ఘటనపై రాజీపడకుండా వ్యవహరించాలని విజయశాంతి సూచించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు మహిళల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు మరింత పటిష్ట చర్యలు చేపట్టాలని ఒక మహిళా ప్రజాప్రతినిధిగా విజ్ఞప్తి చేశారు. రాజ్‌కుమార్ ఆత్మహత్యతో కేసు ముగిసినట్లు కాకుండా, పోక్సో కేసు దర్యాప్తు, బెయిల్ ప్రక్రియ, పోలీసుల పాత్ర వంటి అంశాలపై కూడా పూర్తి స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.