షాబాద్ కేసు మరువకముందే.. యాదాద్రిలో పోక్సో కేసు బాధితురాలిని కిడ్నాప్ చేసిన నిందితుడు

Wait 5 sec.

తెలంగాణలో మరో పెను సంచలనం సృష్టిస్తోంది. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జరిగిన దారుణ సంఘటన మరిచిపోకముందే.. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై అఘాయిత్యానికి యత్నించిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంతో.. అదే బాలికను కిడ్నాప్ చేసిన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురి అవుతుండగా.. పోలీసుల తీరుపైనా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అడ్డగూడూరుకు చెందిన బాలెంల చైతన్య అనే వ్యక్తి.. స్థానికంగా ఉన్న ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలిక ఇంటి గోడ దూకిన బాలెంల చైతన్య.. ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ బాలిక కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో నిందితుడు బాలెంల చైతన్యపై క్రైమ్ నంబర్ 94/2026 కింద పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.అయితే.. కేసు నమోదు అయినప్పటికీ నిందితుడు బాలెంల చైతన్యను వెంటనే అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు పంపించకుండా స్టేషన్ నుంచే పోలీసులు వదిలేశారని బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆ తర్వాత ఆ నిందితుడు బయటికి వచ్చి తమ బిడ్డను కిడ్నాప్ చేసినట్లు ఆరోపిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమైందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. పోలీసుల అదుపులో నుంచి విడుదలైన తర్వాత నిందితుడు బాలెంల చైతన్య.. మళ్లీ అదే బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో బాలిక కనిపించకపోవడంతో ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడు.. బాలిక కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.ఇక ఇటీవలె షాబాద్‌లో పోక్సో కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన నిందితుడు రాజ్‌కుమార్.. బెయిల్‌పై బయటికి వచ్చి ఆరుగురిని హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. మరో పోక్సో నిందితుడిపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధిత బాలిక, ఆమె తల్లి, నానమ్మతోపాటు.. నిందితుడు తన భార్య, ఇద్దరు పిల్లలను అతి కిరాతకంగా చంపడం తీవ్ర దుమారం రేపింది. పోక్సో కేసుల్లో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజా సంఘాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని.. బాలికను సురక్షితంగా గుర్తించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.