అనంతపురంలో బంగారం పంట.. రామగిరి గనులకు మహర్దశ

Wait 5 sec.

ఆ గనులకు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. ఒకప్పుడు నిత్యం కళకళలాడిన ఆ గనులు కొంతకాలం కిందట బోసిపోయాయి. ఇప్పుడు బోసిపోయిన చోటే నవ్వులు చిందనున్నాయి. పాత అనంతపురం జిల్లా ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాలో బంగారు గనులకు పేరొందిన రామగిరిలో మళ్లీ పెద్దఎత్తున బంగారం మైనింగ్ కోసం అడుగులు వేగంగా పడుతున్నాయి. మైనింగ్ లీజుల కోసం టెండర్లు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రామగిరిలో ఒకప్పుడు బంగారం తవ్వకాలు ఓ రేంజ్‌లో జరిగాయి. 1973 మార్చి 15న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్‌కు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 461 ఎకరాలను బంగారం తవ్వకం కోసం లీజుకు ఇచ్చింది. ఆ సంస్థ ఆధ్వర్యంలో వందలాది మంది కార్మికులు గొప్పగా బతికారు. 2001 వరకూ ఇక్కడ మైనింగ్ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఉత్పత్తి వ్యయం పెరగడంతో మైనింగ్ మూతపడింది. READ ALSO 2001 సమయానికి గ్రాము బంగారం రూ. 4,800 వరకు ఉండగా, దాన్ని వెలికి తీసేందుకు ఇక్కడ రూ. 10 వేలకు పైగా ఖర్చు అయ్యేది. దాంతో నష్టం వస్తుండటంతో భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థ 2001లో రామగిరి గనులను మూసేసింది. కంపెనీ మూతపడ్డాక తవ్వకాలకు ఉపయోగించిన భారీ యంత్రాలు, అప్పటి వరకు తవ్విన టన్నుల కొద్దీ మట్టిని కూడా అక్కడే వదిలేసింది. అయితే, ఇటీవల జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఓ సర్వే చేసి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం గనుల ప్రాంతంలో 5 వేల ఎకరాల్లో టన్ను మట్టికి 3.6 గ్రాముల బంగారం ఉన్నట్లు ఆ నివేదికలో తేలింది. కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతంలో ప్రస్తుతం టన్ను మట్టికి 1 గ్రాము బంగారం మాత్రమే వస్తుండగా.. అక్కడ త్వరలోనే పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అధికారులు, నాయకుల ప్రయత్నాలు ఫలితస్తే త్వరలోనే శ్రీసత్యసాయి జిల్లాలోని రామగిరి ప్రాంత ప్రజల తలరాతలే మారిపోనున్నాయి. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. రామగిరి గనుల పునరుద్ధరణకు 15 ఏళ్లుగా కృషి చేస్తున్నట్లు రాప్తాడు ఎమ్మెల్యే పరిటా సునీత పేర్కొన్నారు.