భార్యను చంపాలని భర్త.. భర్తను చంపాలని భార్య ఉన్న ఈ లోకంలో ఒకళ్ల కోసం ఒకళ్లు బతకడమనేది కలే. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఒకరు, ఆస్తి కోసం ఇంకొకరు, ఆశల కోసం మరొకరు బంధాల్నే తెంచేసుకుంటున్న ఈ లోకంలో ఈ ఇద్దరూ ఆదర్శ దంపతులు అనే చెప్పొచ్చు. భర్త చనిపోయి ఒక్క రోజు కూడా కాలేదు. భర్త లేని ఈ బతుకు వద్దనుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా మండలం చెందిన భూపతి శ్యామ్‌కుమార్‌, వెన్నెల భార్యాభర్తలు. వీరిద్దరికి 11 ఏళ్ల కిందట వివాహమైంది. అప్పటి నుంచి ఒకరంటే ఒకరికి ప్రాణం. ఒకర్ని విడిచి మరొకరు ఉండిందే లేదు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్తారు. ఇద్దరూ కలిసి చెరువుల మీద పనికి వెళ్తూ జీవిస్తున్నారు. READ ALSO ఆరు నెలల కిందట ఇల్లు కట్టుకోవాలని, భార్య వెన్నెల ఆరోగ్యం సరిగా లేకపోవడంతో భూపతి శ్యామ్‌కుమార్ అప్పు చేశాడు. అయితే, తీసుకున్న అప్పు చెల్లించలేకపోయాడు. అప్పుల బాధ తాళలేక ఈ నెల 4వ తేదీన కలుపు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. మత్యువుతో పోరాడిన శ్యామ్‌కుమార్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ ఈ మంగళవారం కన్నుమూశాడు.ఇన్నాళ్లపాటు భర్తతో కలిసిమెలిసి ఉన్న వెన్నెల.. అతను లేకుండా ఒక్కరోజు ఒంటరి తనాన్ని కూడా భరించలేకపోయింది. ఈ క్రమంలో తమ కుమారుడికి ఫోన్ ఇచ్చి ఆడుకోవాలని చెప్పిన 26 సంవత్సరాల వెన్నెల ఇంట్లోకి వెళ్లి చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన ముదినేపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఒక్క రోజు వ్యవధిలోనే భార్యాభర్తలు మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇద్దరూ చనిపోవడంతో అనారోగ్యంతో మంచానికే పరిమితమైన శ్యామ్ కుమార్ తల్లి, ఆరేళ్ల కొడుకు అనాథలుగా మిగిలిపోయారు. గతంలో శ్యామ్ అక్క, అన్నయ్యలు కూడా ఇలానే ఆత్మహత్యలు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.