హైదరాబాద్‌లోని సైదాబాద్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన హోంవర్క్ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. రెండో తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి ఇస్లామిక్ మతానికి సంబంధించిన కల్మా, సూరా ఫాతిహా చదివి రావాలని హోంవర్క్ ఇవ్వడం తీవ్ర వివాదానికి కారణం అయింది. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కాస్తా చిలికి చిలికి గాలి వానలా మారడంతో రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఈ వివాదంపై స్పందిస్తూ తీవ్ర విమర్శలు చేశారు.సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్‌లో 2వ తరగతి చదువుతున్న విద్యార్థి స్కూల్ డైరీలో "దీనియాత్" సబ్జెక్టు కింద సూరా ఫాతిహా చదవాలని హోంవర్క్ ఇచ్చారు. అంతకుముందు ఈనెల 11వ తేదీన కల్మా చదవాలని రాసి.. ఆ విద్యార్థి ముస్లిం కాదని, హిందువు అని గుర్తించిన తర్వాత దాన్ని కొట్టివేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని కలిసి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.తమ పిల్లలకు మతపరమైన పాఠాలను ఎందుకు బోధిస్తున్నారని వారిని ప్రశ్నించారు. అయితే స్కూల్ నిబంధనల ప్రకారమే హోంవర్క్ ఇచ్చినట్లు సదరు ఉపాధ్యాయురాలు చెప్పినట్లు విద్యార్థి కుటుంబం ఆరోపించింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు, బీజేపీ నాయకులు కలిసి సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ వివాదం కాస్తా తీవ్రరూపం దాల్చడంతో వెంటనే సక్సెస్ స్కూల్ యాజమాన్యం స్పందించింది. ఇది సదరు టీచర్ చేసిన పొరపాటు వల్ల జరిగిందని పేర్కొంది. ఈ క్రమంలోనే ఆ టీచర్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు వెల్లడించింది. భవిష్యత్తులో తమ విద్యాసంస్థల గ్రూపులో ఆమెకు ఎలాంటి ఉద్యోగావకాశాలు ఇవ్వబోమని స్పష్టం చేసింది. తమ పాఠశాలలో అధిక సంఖ్యలో ముస్లిం విద్యార్థులు ఉండటంతో వారికి మాత్రమే "దీనియాత్" బోధిస్తామని.. ఇతర మతాల విద్యార్థులకు అలాంటి బోధన ఉండదని సక్సెస్ స్కూల్ యాజమాన్యం వివరణ ఇచ్చింది.ఈ ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. హిందూ విద్యార్థికి కల్మా, సూరా ఫాతిహా హోంవర్క్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఇది హిందూ సంస్కృతిపై దాడి అని అభివర్ణించారు. స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలపై సెక్యులర్ వాదులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించిన బండి సంజయ్.. దీన్ని హిందూ సమాజం మొత్తం ఖండించాలని పిలుపునిచ్చారు.