తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన తనను అవమానిస్తూ.. వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత కల్పిస్తున్నారని, తనను అవమానిస్తున్నారంటూ బీసీ నాయకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రభుత్వ విప్ ఎదుటే జరిగింది. నందిగామ పురపాలక సంఘం పరిధిలోని డీవీఆర్ కాలనీలోని 18వ వార్డు టీడీపీ ఇన్‌‌చార్జ్‌గా, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా తోటకూర సూర్యనారాయణ పనిచేస్తున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్రీయాశీలకంగా పనిచేసిన ఆయన్ను కాదని.. కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన బండారు శేషుకు ఎక్కువ ప్రాధాన్యాత ఇస్తున్నారని, తనను అవమానిస్తున్నారంటూ నందిగామ వచ్చిన ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ఎదుటే మనస్తాపంతో శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. పార్టీ పట్టణ అధ్యక్షుడు యేచూరి రామకృష్ణ తనను పక్కనబెట్టి శేషుకు ప్రాధాన్యం ఇవ్వడంతో కొంత కాలం కిందట సూర్యనారాయణ పార్టీ పదవికి రాజీనామా చేశారు. దాంతో పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడటంతో మళ్లీ పార్టీలో కొనసాగుతున్నారు. అదేవిధంగా తను, తన కుటుంబంపై కూడా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన చెప్పారు. మెప్మాలో నవ్యాంధ్ర గ్రూపు వీఓగా పనిచేస్తున్న తన భార్యను తొలగించి మరొకరికి వీఓ పోస్టు ఇవ్వాలని టీడీపీ పట్టణ అధ్యక్షుడు యేచూరి రామకృష్ణ ప్రయత్నిస్తున్నారంటూ సూర్యనారాయణ ఆరోపించారు. ఇదే విషయమై ప్రభుత్వ విప్ సౌమ్య నేరుగా ఫోన్ చేసి మాట్లాడారని, దాంతో ఆందోళనకు గురై పెట్రోల్ తీసుకుని ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు వెళ్లి పార్టీ నాయకుల సమక్షంలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి సూర్యనారాయణ పాల్పడ్డారు. పట్టణ అధ్యక్షుడు రామకృష్ణ తనను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన సూర్యనారాయణ, తన భార్యను వీఓగా తొలగించి గతంలో పనిచేసిన మహిళకు ఆ బాధ్యతలు ఇవ్వాలని చూస్తున్నట్లు సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్న నాయకులు కనీసం తనతో మాట్లాడటం లేదంటూ ఆయన వాపోయారు.