ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తోంది.. అలా పోస్ట్, ట్వీట్ వేయగానే నిమిషాల్లో ప్రపంచం మొత్తానికి తెలిసిపోతుంది. సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పదే, పదే హెచ్చరిస్తుంటాయి. కొంతమంది మాత్రం ఇష్టం వచ్చినట్లుగా ఏదేదో పోస్ట్ చేస్తూ కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఇటీవల నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, అసత్య ప్రచారాలు, అసభ్యకర పోస్టులు, ద్వేషపూరిత వ్యాఖ్యల్లాంటి చర్యలను నియంత్రించేందుకు కార్యాచరణ రూపొందించే పనిలో ఉణ్నారు.ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. 'డిప్యూటీ సీఎం .. పవన్ రహస్యంగా జరిపే రాజకీయ చర్చల వివరాలనే ఈ నిఘా వర్గాలు టార్గెట్ చేసినట్లు సమాచారం. పార్టీ రహస్యాలు బయటకు పొక్కుతున్నాయని గ్రహించిన జనసేనాని.. ఇటీవల కఠినమైన నిర్ణయాలు తీసుకున్నార‌ని జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి' అంటూ ఎక్స్‌ (ట్విట్టర్) అకౌంట్ ద్వారా కొంతమంది ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ కావడంతో ఆంధప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది.' పై లోకేష్ నిఘా నేత్రం అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. ఇలాంటి ఫేక్ వార్తలను షేర్ చేయడం, ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. తప్పుడు ప్రచారం చేస్తున్న మీడియా హాండిల్స్ పై ప్రభుత్వం చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది' అంటూ స్పందించింది. మరోవైపు మాజీ సీఎం వైఎస్ జగన్ హెలికాప్టర్‌కు అనుమతి ఇవ్వలేదంటూ జరుగుతున్న ప్రచారంపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. 'ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించనప్పటికీ, రాజకీయ ప్రయోజనాలు మరియు సానుభూతి కోసం లేని సమస్యను ఉన్నట్టుగా చూపడం కొందరికి అలవాటుగా మారింది. రాష్ట్రంలో ఎవరి ప్రయాణ విధానాలపైనా ఎలాంటి ఆంక్షలు లేవు. అయిన సరే ఆంక్షలు విధించినట్టు చిత్రీకరించడం, దాన్ని ప్రచారానికి వాడుకోవడం దురదృష్టకరం. రాజకీయ ప్రయోజనాల కోసం లేదా సానుభూతి కోసం ఇలాంటి తప్పుడు కథనాలను సృష్టించే వారు మరియు వాటిని నిజమని నమ్మి షేర్ చేసే వారు కూడా చట్టపరమైన ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కాబట్టి సోషల్ మీడియా ఏ సమాచారాన్నైనా షేర్ చేసే ముందు దాని నిజానిజాలను సరిచూసుకోవడం ఎంతో అవసరం' అంటూ స్పందించారు.