Tirumala: టీటీడీ మాజీ ఉద్యోగి ఘనకార్యం.. పాపం బెంగళూరు భక్తులకు ఎంత కష్టం వచ్చింది

Wait 5 sec.

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. కొందరు కేటుగాళ్లు, దళారులు భక్తులకు దర్శనాలు, వసతి గదులు ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారు. టీటీడీ దళారులు, మోసగాళ్లకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతోంది.. అయినా సరే కొందరు మాత్రం భక్తుల్ని మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా టీటీడీ మాజీ ఉద్యోగి భక్తుల్ని నిండా ముంచేశాడు.. దర్శనం, సేవలు, వసతి గదుల పేరుతో మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదు, గతంలో కూడా ఇలాంటి మోసాలు చేయడంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. గతంలో అరుణ్‌కుమార్‌ టీటీడీలో కొంతకాలం ఉద్యోగిగా పనిచేయగా.. ఆయన్ను తొలగించారు. 2023లో భక్తులకు దర్శనాలు, వసతి గదులు పేరు చెప్పిమోసాలకు పాల్పడటంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు. అయినా సరే అరుణ్‌కుమార్ బుద్ధి మాత్రం మారలేదు. ఇటీవల బెంగళూరుకు చెందిన రెండు కుటుంబాలను మాయ చేశాడు. తిరుమల శ్రీవారి దర్శనం, సేవల టికెట్లు, వసతి గదులు ఇప్పిస్తానని నమ్మించాడు. భక్తుల దగ్గర నుంచి రూ.3.20 లక్షల వరకు వసూలు చేశాడు.. కానీ టికెట్లు ఇవ్వకపోవడంతో మోసపోయామని భక్తులు గుర్తించారు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల టూ టౌన్ పోలీసులు అరుణ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. నిందితుడి బ్యాంకు అకౌంట్ పరిశీలించగా ఏడాదిలో దాదాపు రూ.85 లక్షల లావాదేవీలు జరిగినట్లు తేలింది. అరుణ్‌కుమార్ మొబైల్, రూ.99,000 డబ్బులు, మూడు బ్యాంకు పాసుపుస్తకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరుణ్‌కుమార్‌ను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. టీటీడీలో పనిచేసిన వ్యక్తి ఇలా భక్తుల్ని నమ్మించి మోసం చేయడం హాట్‌టాపిక్ అయ్యింది. టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ వ్యక్తి నిరుద్యోగుల్ని మోసం చేసిన ఘటన కూడా బయటపడింది. టీటీడీ నకిలీ లోగో, ఈవో స్టాంపులతో దొంగ నియామకపత్రాలతో అమాయకుల్ని మోసం చేశాడు. కిరణ్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి లాయర్‌నని చెప్పి తిరుపతిలోని కొందరు నిరుద్యోగుల్ని పరిచయం చేసుకున్నాడు. టీటీడీలో అన్యమత ఉద్యోగాల స్థానంలో కొత్తగా నియామకాలు చేపడుతున్నట్లు నమ్మించాడు. తనకు టీటీడీలో జీఎం పోస్టులో ఉన్న వ్యక్తి బాగా తెలుసని.. ఆయన ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పాడు. జూనియర్‌ అసిస్టెంట్‌తోపాటు మరికొన్ని పోస్టులు ఇప్పిస్తానని వారితో చెప్పాడు. నిరుద్యోగులు ఒక్కొక్కరి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.50లక్షల వరకు వసూలు చేశాడు. టీటీడీ నకిలీ లెటర్ హెడ్, ఈవో స్టాంపు, సంతకంతో అపాయింట్‌మెంట్ లెటర్లు కూడా సిద్ధం చేసి వారికి అందజేశాడు. ఉద్యోగాల్లో చేరేందుకు కొంత కాలం ఆగాలని నమ్మబలికాడు. డబ్బులు ఇచ్చిన బాధితులు చాలాకాలం వేచి చూశారు.. ఆ తర్వాత అనుమానం వచ్చి టీటీడీ ఉద్యోగాల భర్తీ గురించి ఆరా తీశారు. అప్పుడు ఏ పోస్టులు భర్తీ చేయలేదని క్లారిటీ ఇవ్వడంతో మోసపోయామంటూ తిరుతపి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిరణ్‌కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.