సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు నేత కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జులై 14న హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాపు నేతగా తెలుగు ప్రజలకు సుపరిచితుడైన ముద్రగడ.. ఎమ్మెల్యేగా, మంత్రి, ఎంపీగా సేవలు అందించారు. తాత, తండ్రుల నుంచి వచ్చిన వారసత్వంతో ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. జమీందారీ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ముద్రగడకు పట్టుదల ఎంతో ఎక్కువ. దూకుడు స్వభావం ఉన్న ముద్రగడ.. అవసరమైతే సీఎంలతోనూ ఢీకొట్టడానికి సిద్ధపడేవారు.1978లో జనతా పార్టీ నుంచి పోటీ చేసి 25వ ఏటే ఎమ్మెల్యేగా గెలిచిన ముద్రగడ.. 1983, 1985ల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఎన్టీఆర్ కేబినెట్లో ఎక్సైజ్, రవాణా శాఖ మంత్రిగా పని చేసిన ఆయన.. అనూహ్యంగా పదవికి రాజీనామా చేశారు. 1988లో కత్తిపూడిలో భారీ బహిరంగ సభ నిర్వహించిన ముద్రగడ నాటి ప్రధాని రాజీవ్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి మర్రి చెన్నారెడ్డి కేబినెట్లో మంత్రిగా పని చేశారు.1989 ఎన్నికల ముంగిట చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. అప్పుడు టీడీపీ అధికారంలో ఉండటంతోపాటు ఎన్టీఆర్ సీఎంగా ఉన్నారు. దీంతో బాలకృష్ణ సినిమాను ఆడించడానికి టీడీపీ క్యాడర్ ప్రయత్నించింది. కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభానికి చెందిన థియేటర్లో చిరంజీవి సినిమా రిలీజ్ చేశారు. ఆ సినిమాను తీసేసి బాలయ్య సినిమా ఆడించడానికి ప్రయత్నాలు జరిగాయి.Read Also: దీని కోసం అధికార యంత్రాంగంతో ముద్రగడపై ఒత్తిడి తెచ్చారు. అయినా సరే ఆయన వెనక్కి తగ్గలేదు. థియేటర్‌కు సీల్ వేసేయమని చెబుతున్నారని ఎమ్మార్వో చెప్పినా ఆయన వినలేదు. ఆర్డీవో వచ్చి గొడవ చేసినా తగ్గలేదు. చివరకు నాటి కలెక్టర్ జయప్రకాష్ నారాయణ సైతం మీతో మాట్లాడాలి, రమ్మని కబురు పెట్టారు. అయితే నేను రాను, మా మేనేజర్‌‌ను పంపిస్తానని బదులిచ్చినట్లు ముద్రగడ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.అధికార యంత్రాంగం నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆయన సినిమాను థియేటర్ నుంచి తీసేయలేదు. ‘‘సినిమా 50 రోజుల ఫంక్షన్‌కు చిరంజీవిని పిలుద్దామని భావించాను. కానీ సున్నిత మనస్కుడైన ఆయన ఒత్తిడి వల్ల రాకపోతే నా పరువు పోతుందని పిలవలేదు. సినిమా ఎన్ని షోలు వేశామో తెలీదు. సెకండ్ షో అయిపోయాక సినిమా ప్రదర్శించొద్దని పోలీసులు చెప్పారు. కానీ తెల్లవార్లూ సినిమాను ఆడించాం. 70వ రోజు ఘనంగా చేయాలని రామారావు చేత చెప్పించుకొని బాలకృష్ణ ఫ్యాన్స్ ఉత్తరాలు రాయించారు. చిరంజీవి సినిమా తీసేయలేదనే కసితో మా సినిమా హాలు, ఇల్లు, రైస్ మిల్లు.. అన్నింటికీ కరెంట్ తీసేయించారు. అప్పట్లో ఇండ్లలో జనరేటర్లు లేవు. దీంతో చీకట్లోనే ఉన్నాం. కానీ థియేటర్‌లో జనరేటర్ ఉంది. జనరేటర్‌తో సినిమాను ఆడించాను. జనరేటర్‌ను సీజ్ చేయడానికి కూడా అధికారులు ప్రయత్నించారు. కానీ నా థియేటర్లో అడుగుపెట్టొద్దని వారిని హెచ్చరించాను. దీంతో మూడు రోజుల అయిపోయాక కరెంట్ సరఫరా పునరుద్ధరించారు’’ అని ముద్రగడ చెప్పారు.‘‘సినిమా 70వ రోజు వచ్చే సరికి 1989 ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. మిగతా 30 రోజులు టికెట్లు లేకుండా జనానికి ఉచితంగా సినిమా చూపించాను. దీంతో అవతలి థియేటర్‌కు ఊపిరి ఆడలేదు. సినిమా 103, 104 రోజు అయ్యే సరికి కాంగ్రెస్ నుంచి నేను ఎమ్మెల్యేగా గెలిచాను. ఆ తర్వాతే సినిమాను తీసేశాను’’ అని ముద్రగడ చెప్పుకొచ్చారు.‘‘చిరంజీవి ఎన్టీఆర్‌కు ఫోన్ చేస్తే.. ‘బ్రదర్ కిర్లంపూడిలో డిస్ట్రబెన్స్‌గా ఉంది, ప్రింట్ తెప్పించేయమ్మా అని అన్నారు’. చిరంజీవి ఆఫీసు నుంచి ప్రింట్ కోసం కొందర్ని పంపించారు. ‘ప్రింట్‌కు పెట్రోల్ పోసి అగ్గిపుల్ల వేస్తాను. మీ గురించి మేం తగవు పడుతుంటే.. మీరు ప్రింట్ ఇచ్చేయమంటారా?’ అని గొడవ పడ్డాను. ఎవరైనా పోలీసు బందోబస్త్ మధ్య వచ్చి ప్రింట్ తీసుకుంటారనే భయంతో ఐదు లీటర్ల పెట్రోల్ తెప్పించి రెడీగా పెట్టుకున్నాను’’ అని ముద్రగడ చెప్పారు.Read Also: అయితే ఎన్టీఆర్ తన పట్ల ఎంతో ప్రేమగా, గౌరవంగా వ్యవహరించేవారని ముద్రగడ చెప్పారు. రామారావు గారి దగ్గర పొందిన ప్రేమ, గౌరవం ఎవరి దగ్గరా నేను పొందలేదని ముద్రగడ చెప్పారు.1989లో చిరంజీవి నటించిన అత్తకి యముడు.. అమ్మాయికి మొగుడు, బాలకృష్ణ నటించిన భలే దొంగ సినిమాలు సంక్రాంతి సమయంలో రిలీజ్ అయ్యాయి. అదే ఏడాది జూన్‌లో చిరంజీవి నటించిన రుద్రనేత్ర, బాలయ్య సినిమా అశోక చక్రవర్తి రెండు వారాల వ్యవధిలో విడుదలయ్యాయి. ఈ సినిమాల ప్రదర్శన విషయంలోనే కిర్లంపూడిలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది.