మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత మరణంపై రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు. రాజకీయాల్లో మొదటి నుంచి ప్రజా సమస్యలు, తన అనుచరులకు ఎదురైన ఇబ్బందులపై గట్టిగా పోరాడేవారని గతంలో జరిగిన సంఘటనల్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నో సందర్భాల్లో ఆయన పోరాటాలు చేసి వార్తల్లో నిలిచాయంటున్నారు. 2005లో ముద్రగడ పద్మనాభం చేసిన ఓ పోరాటం సంచలనమైంది. 2025లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిపై పోరాటం చేశారు. ఏలేరు కాలువను పోలవరం ప్రాజెక్టులో భాగమైన పోలవరం ఎడమ ప్రధాన కాలువతో అనుసంధానంపై అప్పటి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేరు కాలువ ఆధునీకీకరణకు సంబంధించి భూసేకరణ పరిహారం పంపిణీకి సంబంధించి వివాదం నడిచింది. 2005లో ముద్రగడ పద్మనాభం ఏలేరు కాలువ ఆధునీకీకరణ పనులు, భూసేకరణకు సంబంధించి స్థానిక రైతులతో కలిసి ఆందోళనకు దిగారు. ఏలేరు కాలువ నిర్మాణానికి భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం విషయంలో అన్యాయం జరుగుతోందని ముద్రగడ ఆరోపించారు. పరిహారం పంపిణీ వ్యవహరంలో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటూ రైతులకు మద్దతుగా చేసిన పోరాటంలో ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. ఈ వివాదం మరింత ముదరడంతో రైతులకు న్యాయం న్యాయం చేయాలని, తనపై అక్రమంగా కేసులు పెట్టి వేధించాలని చూస్తే గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటానని బహిరంగంగా ప్రకటించడం అప్పట్లో సంచలనమైంది. ప్రభుత్వ స్పందన కోసం ముద్రగడ 2005 అక్టోబర్ 21 ఉదయం 11 గంటలను గడువుగా నిర్ణయించారు. ఆయన పక్కన తుపాకీ ఉంది.. అలాగే నిరాహార దీక్షలో ఉన్న కుటుంబ సభ్యులు, అనుచరులు, కాపు నాయకులలో భయపడ్డారు. అప్పటి కాకినాడ ఎంపీ ఎంఎం పల్లం రాజు నేతృత్వంలో ఒక టాస్క్ ఫోర్స్‌న కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్లారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి కలెక్టర్ సంతకం చేసిన ఒక లేఖను అందజేశారు. అయితే అప్పటికే ముద్రగడ తుపాకీని గురి పెట్టుకున్నారు. అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట గోపాలకృష్ణ ఎంతో కష్టపడి ముద్రగడను ఒప్పించారు.. పద్మనాభం పల్లంరాజు తీసుకొచ్చిన లేఖ చదివిన తర్వాత నిరాహార దీక్షను విరమిస్తున్నానని ప్రకటించారు. అనంతరం ముద్రగడతో పాటుగా కుటుంబసభ్యులు, అనుచరులు దీక్ష విరమించారు. వెంటనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి, ప్రభుత్వం ప్యాకేజీకి అంగీకరిస్తూ జీవోను విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం మరణంపై సంతాపాన్ని తెలియజేసిన మా మంత్రి పొన్నాపొన్నాల లక్ష్మయ్య 2005 నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. ముద్రగడ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఒక కీలక మలుపుగా నిలిచిందన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్‌లో తాను నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో ముద్రగడకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చల అనంతరం, జలయజ్ఞం నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల ప్రభావితమైన కుటుంబాల కోసం సవరించిన ఒక చారిత్రాత్మక పునరావాస (ఆర్&ఆర్) ప్యాకేజీకి ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఆ నిర్ణయం ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన ప్రజల పునరావాసాన్ని గణనీయంగా బలోపేతం చేసిందన్నారు. ముద్రగడ పద్మనాభం 1988లో ప్రత్తిపాడు నియోజకవర్గం ఉత్తరకంచిలో తన అనుచరుల్ని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకించారు.. ఏకంగా 13 రోజుల పాటూ పోలీస్ స్టేషన్ దగ్గర ఆయన ఆందోళనలు చేయడంతో అనుచరుల్ని పోలీసులు విడిచిపెట్టారు. ఆ తర్వాత ముద్రగడ 1997లో కాపుల్ని బీసీల్లో చేర్చాలని ఉద్యమాలు చేశారు. ఆ సమయంలో తన అనుచరులపై నమోదు చేసిన కేసుల్ని తొలగించాలని ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి ఆ కేసుల్ని తొలగించారు. 2015 నుంచి ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేశారు. 2016లో జనవరి 31న తునిలో కాపు ఐక్య గర్జన సభ ఏర్పాటు చేయగా.. ఆ సమయంలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు దహనం చేసిన ఘటన సంచలనం రేపింది. ఆ తర్వాత ముద్రగడ దీక్షలు కూడా చేశారు.. 2020లో ఆయన కాపు రిజర్వేషన్ల ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.2020 తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.. 2024 ఎన్నికలకు ముందు ఆయన యాక్టివ్ అయ్యారు. ముద్రగడ జనసేన పార్టీలో చేరతారని ప్రచారం జరిగినా.. ఆ తర్వాత పరిణామాలు మారడంతో వైఎస్సార్‌సీపీలో చేరారు. పిఠాపురం నుంచి పోటీచేసిన పవన్ కళ్యాణ్‌ను ఓడిస్తానని ముద్రగడ సవాల్ చేశారు.. ఒకవేళ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ప్రకటించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించగా.. తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు.