రూ. 350 కోట్లతో జయలలిత ఇల్లు కొనుగోలు చేస్తున్న విజయ్..? పోయెస్ గార్డెన్లోకి సీఎం మకాం..?

Wait 5 sec.

తమిళనాడులో దశాబ్దాలపాటు కొనసాగిన డీఎంకే, అన్నాడీఎంకే ఆధిపత్యాన్ని బద్దలు కొడుతూ.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ దుందుభి మోగించగా.. విజయ్ సీఎంగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టి అనతి కాలంలోనే విజయ్ వినూత్నమైన, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యా సంస్థలు, ప్రార్థన మందిరాలు, బస్టాండ్ల సమీపంలోని మద్యం దుకాణాలను మూసేయించడంతోపాటు.. ఆర్టీసీ బస్సులను ఆధునికీకరిస్తున్నట్లు ప్రకటించారు. పోలీసు, అధికార వ్యవస్థలో రాజకీయ జోక్యానికి ఆయన చెక్ పెట్టారు.గత రెండు నెలల నుంచి చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని తన నీలాంకరి నివాసం నుంచి రాజాజీ రోడ్డులోని సెక్రటేరియట్‌కు సీఎం విజయ్ రోజూ కార్లో వచ్చి వెళ్తున్నారు. క్రమం తప్పకుండా సెక్రటేరియట్‌కు వెళ్తున్న విజయ్.. ప్రభుత్వ ఉద్యోగి తరహాలోనే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సచివాలయంలో పని చేస్తున్నారు. అయితే విజయ్ రాకపోకలు సాగిస్తుండటం వల్ల ఈస్ట్ కోస్ట్ రోడ్‌లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.సీఎం కాన్వాయ్ వెళ్లడం కోసం ఉదయం, సాయంత్రం వేళల్లో ఈస్ట్ కోస్ట్ రోడ్‌లో ట్రాఫిక్‌ను నియంత్రించాల్సి వస్తోంది. దీంతో స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లే వారికి ఇబ్బంది కలుగుతోంది. సెక్రటేరియట్ నుంచి విజయ్ నివాసం సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ సిబ్బంది వాహనాలను అదుపు చేయడానికి విధి నిర్వహణలో పాల్గొనాల్సి వస్తోంది.తనవల్ల వాహనదారులకు అసౌకర్యం కలుగుతుండటంతో సీఎం విజయ్ సెక్రటేరియట్‌కు సమీపంలోకి నివాసాన్ని మార్చుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో సీఎం విజయ్ ఇంటిని కొనుగోలు చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతకు ముందు అన్నాడీఎంకే నాయకుడు, మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి నివాసం ఉంటున్న గ్రీన్ లేన్‌లోని ఇంట్లోకి లేదా మాజీ మంత్రులు ఖాళీ చేసిన బంగ్లాలోకి విజయ్ వెళ్తారని ప్రచారం జరిగింది.తమిళనాడు మాజీ సీఎం, దివంగత నాయకురాలు జయలలిత నివాసం ఉన్న ‘వేద నిలయం’ను విజయ్ కొనుగోలు చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. జయలలిత మేనకోడలు దీప దగ్గర్నుంచి రూ. 350 కోట్లకు ఈ బంగ్లాను కొనుగోలు చేయడం కోసం చర్చలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ డీల్ ఒకవేళ నిజమైన పక్షంలో.. విజయ్ కాన్వాయ్ కారణంగా చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్‌లు తగ్గుతాయి. అయితే పోయెస్ గార్డెన్‌లోని జయలలిత ఇంటిని విజయ్ కొనుగోలు చేస్తున్నారనే ప్రచారం తప్పితే.. ఇరు పక్షాల నుంచి ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన గానీ, ధ్రువీకరణ గానీ రాలేదు.పోయెస్ గార్డెన్.. చెన్నైలోనే ఖరీదైన ఏరియా..పోయెస్ గార్డెన్ అనేది చెన్నైలో వీవీఐపీలు నివాసం ఉండే ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి సచివాలయం 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సూపర్ స్టార్ రజినీకాంత్‌తోపాటు ధనుష్, శశికళ‌తోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఈ ప్రాంతంలోనే నివాసం ఉంటున్నారు. విజయ్, రజినీకాంత్ మధ్య చాలా కాలంగా సరైన సంబంధాలు లేని సంగతి తెలిసిందే. విజయ్ సీఎం అయ్యాక రజినీకాంత్ అభినందిస్తూ ట్వీట్ కూడా వేయలేదని టీవీకే శ్రేణులు గుర్రుగా ఉన్నాయి.జయ భద్రతా సిబ్బంది తీరు రజినీ ఆగ్రహం..రజినీకాంత్ నివాసం పక్కనే ఉన్న వేద నిలయంలోకి సీఎం విజయ్ మకాం మారుస్తారనే ప్రచారం జరుగుతుండటం ఆసక్తికరంగా మారింది. గతంలో జయలలిత సీఎంగా ఉన్న సమయంలో సెక్యూరిటీ సిబ్బంది భద్రతా కారణాలతో ఆమె రజినీకాంత్ కారును వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో ఆమె కాన్వాయ్ వెళ్లడానికి వీలుగా రజినీకాంత్‌ను వేచి ఉండేలా చేశారు. దీంతో రజినీకాంత్ కారు దిగి వెళ్లి ఓ స్తంభం పక్కన నిలబడి సిగరెట్ కాలుస్తూ సామాన్యుడిలా నిలబడ్డారు. ఆయన్ను చూడటానికి నిమిషాల్లోనే వందలాది మంది అక్కడ గుమికూడారు. దీంతో జయలలిత కాన్వాయ్ కూడా ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది.