ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది.. రాష్ట్రంలో చేనేత కార్మికులకు శుభవార్త చెప్పింది. ఆగస్టు 7న నేతన్నకు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేయనుంది. నేతన్నకు భరోసా పథకం కింద చేనేత కార్మికులు ఒక్కొక్కరికి రూ.25వేలు సాయం అందించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకం కింద చేనేతలకు రూ.24వేలు ఇవ్వగా.. కూటమి ప్రభుత్వం అదనంగా మరో రూ.1000 కూడా కలిపి మొత్తం రూ.25వేలు అందజేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్‌లో ఈ నేతన్నకు భరోసా పథకం అమలుకు రూ.250 కోట్లు కేటాయించింది. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను విడుదల చేయనుంది.ఈ పథకం అమలుకు సంబంధించి చేనేత, జౌళిశాఖ కసరత్తు పూర్తి చేసింది. రాష్ట్రంలో దాదాపు 54వేలమంది అర్హులు ఉంటారని అంచనా వేశారు అధికారులు. వాస్తవానికి కూటమి ఎన్నికల్లో చేనేతలకు ఎలాంటి హామీ ఇవ్వకపోయినా సరే వారికి అండగా ఉండేందుకు ఈ సాయం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సొంత మగ్గం ఉండే చేనేత కార్మికులకు కూడా నేతన్నకు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కుటుంబంలో ఒకరికి ఈ ఆర్థిక సాయం రూ.25వేలు అందజేయనున్నారు. గతంలో చేనేత అనుబంధ రంగాలకు చెందిన వారికి ఆర్థికసాయం అందించలేదు.. తాజాగా అనుబంధ రంగాలకు చెందిన వారి నుంచి విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చేనేత రంగానికి అనుబంధంగా ఉండే రాట్నం వడకడం, రంగులు అద్దడం వంటి వారికి కూడా పథకం వర్తింపజేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ రంగాలకు సంబంధించి పది వేల మంది అర్హులు ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించి అవసరమైన ఫైల్‌ను ప్రభుత్వానికి పంపించారు. ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అంతేకాదు చేస్తున్న సంగతి తెలిసిందే. చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నారు. ఈ పథకం అమలు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా లక్ష కుటుంబాలకు లబ్ధి దక్కుతోంది.. వీరిలో 93 వేలమంది చేనేత కుటుంబాలు, 11,488మంది పవర్‌లూమ్‌ కుటుంబాలున్నాయి. చేనేతలకు ఉచిత విద్యుత్తు పథకానికి సంబంధించి ప్రభుత్వం ఏడాదికి రూ.150 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ పథకం అమలు చేయడంతో ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.8,640, పవర్‌లూమ్‌పై నేసే కుటుంబానికి రూ.21,600 ఆదా అవుతోంది.విద్యుత్‌తో పాటుగా చేనేతలకు పింఛన్‌ను రూ.4 వేలకు పెంచింది. అలాగే మరికొన్ని పథకాలను కూడా అమలు చేస్తున్నారు. ఆధునిక యంత్రాల కొనుగోలుపై 90 శాతం రాయితీ అందిస్తున్నారు. ముడిసరకులపై 15 శాతం రాయితీ ఇస్తున్నారు. నాణ్యమైన నూలు సరఫరాతో పాటుగా మార్కెటింగ్‌ సదుపాయం కోసం ఈ కామర్స్ సంస్థల ద్వారా నేరుగా వినియోగదారుల అమ్మకాలు జరిపేలా చూస్తున్నారు. తాజాగా నేతన్నకు భరోసా పథకాన్ని కూడా అమలు చేయబోతున్నారు.