తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ప్రతిరోజూ విరాళాలు, కానుకలు సమర్పిస్తున్నారు. ఒక్కరోజే టీటీడీకి రికార్డుస్థాయిలో భారీగా విరాళాలు వచ్చాయి. మంగళవారం రోజు ఏకంగా రూ.96.98 కోట్ల విరాళాలు అందాయి.. ఆన్‌లైన్ ద్వారా 2,354మంది భక్తులు.. ఆఫ్‌లైన్‌లో 106మంది భక్తులు ఈ విరాళాలను టీటీడీకి సమర్పించారు. వీరిలో 1212మంది దాతలు రూ.లక్షల నుంచి రూ.10లక్షల వరకు విరాళాలు అందజేశారు. 1246మంది భక్తులు రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు విరాళం ఇచ్చారు. ఇద్దరు భక్తులు రూ.కోటి అంతకంటే ఎక్కువ విరాళాన్ని టీటీడీకి అందించారు. టీటీడీ బుధవారం నుంచి కొత్త డోనర్‌ పాలసీ అమలుకు సిద్ధం కావడంతో మంగళవారం రోజు భక్తులు భారీగా విరాళాలను ఇచ్చారు. టీటీడీ సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ వారి దర్శనాలను కల్పించేందుకు ట్రస్టులు, పథకాలకు కొత్తగా విరాళాలు అందించే దాతలు/సంస్థలకు కల్పించే సేవలు, సదుపాయాల్లో (ప్రివిలేజెస్‌) మార్పులు చేసింది. మంగళవారం నిర్వహించిన టీటీడీ పాలకమండలి సమావేశంలో దాతల సదుపాయాలను కొంత తగ్గించి కొత్త డోనర్‌ పాలసీని బుధవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. టీటీడీ దాతల ప్రివిలేజెస్‌ (ప్రత్యేక సదుపాయాలు) విధానంలో మార్పులు తీసుకురానుండటంతో పాత విధానం ద్వారా లబ్ధి పొందేందుకు దాతలు ఒక్కసారిగా భారీగా విరాళాలు అందజేశారని చెబుతున్నారు. మంగళవారం వరకు విరాళాలు అందించిన వారికి పాత విధానం ప్రకారమే సదుపాయాలు కల్పిస్తారు. తిరుమల శ్రీవారి పేరుతో నిర్వహించే వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు కల్పిస్తున్న ప్రివిలేజెస్‌‌లో మార్పులు బుధవారం నుంచి అమలు చేస్తున్నారు. భక్తులు ఈ ప్రివిలేజెస్‌ను దుర్వినియోగం చేసినట్లు తేలితే వెంటనే వాటిని రద్దు చేసే చట్టపరమైన అధికారాన్ని టీటీడీ తొలిసారిగా తీసుకువచ్చింది. ఈ మేరకు దాతలు తమ దర్శన, సేవాకోటాను ‘డోనర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌’ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించడంతో పాటుగా పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద గత రెండేళ్లుగా చూస్తే టీటీడీకి భక్తుల నుంచి భారీగా విరాళాలు అందాయి.