కీలక తీర్పుతో హైదరాబాద్‌లోని రెండు ప్రముఖ హోటల్ సంస్థలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ క్రాస్ సబ్సిడీ సర్‌చార్జ్ డిమాండ్ నోటీసులను సవాలు చేస్తూ దాఖలైన 2 రిట్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడమే కాకుండా.. కోర్టుకు కీలక విషయాలను దాచిపెట్టినందుకు చెరో రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షల జరిమానా విధించింది. జస్టిస్ నాగేష్ భీమపాక ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అబిడ్స్‌లోని బి. సుందర్ రావు హోటల్స్ (తాజ్ మహల్ హోటల్), సికింద్రాబాద్‌లోని సుందర్ తాజ్ మహల్ హోటల్స్ (హోటల్ తాజ్ ట్రిస్టార్).. జారీ చేసిన క్రాస్ సబ్సిడీ సర్‌చార్జ్ డిమాండ్ నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించాయి. ఇందులో ఒక హోటల్‌కు రూ.27.5 లక్షలు, మరో హోటల్‌కు రూ.77.7 లక్షల బకాయిలు చెల్లించాలని టీజీఎస్‌పీడీసీఎల్ నోటీసులు జారీ చేసింది. తాము రైన్ కాల్సైనింగ్ సంస్థ నుంచి నేరుగా విద్యుత్ కొనుగోలు చేస్తున్నందున 2005 నాటి నిబంధనల ప్రకారం సర్‌చార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదని సదరు హోటల్ యాజమాన్యాలు కోర్టులో వాదించాయి. గతంలో ఇదే అంశంపై హైకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులను కూడా తమ వాదనకు ఆధారంగా ఆ హోటల్ యాజమాన్యాలు చూపించాయి.అయితే.. ఈ పిటిషన్లను టీజీఎస్‌పీడీసీఎల్ తరఫు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదే డిమాండ్ నోటీసులపై గతంలో హైకోర్టులో కేసులు వేసి.. తర్వాత ఎలాంటి అనుమతి తీసుకోకుండా వాటిని ఉపసంహరించుకున్నారని గుర్తు చేశారు. ఆ తర్వాత బకాయిలను వాయిదాల్లో చెల్లించేందుకు విద్యుత్ సంస్థను ఆశ్రయించిన విషయాన్ని కూడా హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.ఈ వాస్తవాలను పిటిషనర్లు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని గుర్తించిన హైకోర్టు.. హోటల్ యాజమాన్యాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజాలను వెల్లడించకుండా కోర్టును ఆశ్రయించడం న్యాయవ్యవస్థను తప్పుదోవ పట్టించడమేనని మండిపడింది. గతంలో ఉపసంహరించుకున్న పిటిషన్లపై మళ్లీ కొత్తగా రిట్ దాఖలు చేయడం కూడా చట్టపరంగా సమంజసం కాదని స్పష్టం చేసింది. రెండు హోటళ్లపై రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షల జరిమానాను విధించింది. ఈ మొత్తాన్ని తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీకి చెల్లించాలని హైకోర్టు ఆ హోటల్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ముందు పూర్తి వాస్తవాలతో, నిజాయితీతో హాజరుకావాలనే సందేశాన్ని ఈ తీర్పు బలంగా చాటిందని న్యాయవర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.