ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయానికి తెరలేపింది. థర్డ్ ప్లేస్ ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్‌లను వీక్షించే ఫుట్‌బాల్ అభిమానులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. క్లబ్బులు, బార్లు, మైక్రోబ్రూవరీల మద్యం అమ్మకాల సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తితో.. ప్రభుత్వ అనుమతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో అధికారులు పేర్కొన్నారు. జూలై 19వ తేదీ (ఆదివారం) తెల్లవారుజామున 4.30 గంటల వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చారు. అదే సమయంలో జూలై 19వ తేదీ (ఆదివారం)న జరిగే ప్రతిష్ఠాత్మక ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా జూలై 20వ తేదీ (సోమవారం) తెల్లవారుజామున 3 గంటల వరకు బార్లు తెరిచి ఉంచేందుకు అనుమతి మంజూరు చేశారు.అయితే.. ఈ ప్రత్యేక వెసులుబాటు రాష్ట్రవ్యాప్తంగా కాకుండా తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని 2బీ బార్లు, సీ1 క్లబ్బులు, టీడీ-1, టీడీ-2 లైసెన్సులు కలిగిన సంస్థలు, మైక్రోబ్రూవరీలకు మాత్రమే వర్తిస్తుందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పరిధిలోని సంబంధిత అధికారులకు ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.ప్రపంచంలో అత్యధికంగా వీక్షించే క్రీడా ఈవెంట్లలో ఫిఫా వరల్డ్ కప్ ఒకటి. భారత కాలమానం ప్రకారం ఫైనల్, థర్డ్ ప్లేస్ మ్యాచ్‌లు అర్ధరాత్రి తర్వాత జరుగుతుండటంతో ఫుట్‌బాల్ అభిమానులు పెద్ద సంఖ్యలో స్పోర్ట్స్ బార్లు, క్లబ్బుల్లో మ్యాచ్‌లను వీక్షించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వ్యాపార కార్యకలాపాలు, ప్రేక్షకుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభుత్వం పొడిగించిన సమయాల్లో కూడా అన్ని బార్లు, క్లబ్బులు ఎక్సైజ్ నిబంధనలు, శాంతిభద్రతల మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఫిఫా ఫైనల్స్ సందర్భంగా హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ ఫీవర్ మరింత పెరగనుండగా, ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం క్రీడాభిమానులు, హాస్పిటాలిటీ రంగానికి ఊరటనివ్వనుంది.