షాబాద్‌ 6 హత్యల కేసులో మరో ట్విస్ట్.. నిందితుడు రాజ్‌కుమార్ మృతిపైనా కేసు నమోదు

Wait 5 sec.

రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా షాబాద్‌ ఆరు హత్యల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భార్య, ఇద్దరు చిన్నారులు, ఓ మైనర్ బాలికతో పాటు ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేసిన నిందితుడు పార్వతి రాజ్‌కుమార్ మృతిపైనా పోలీసులు ప్రత్యేక కేసు నమోదు చేశారు. అతడి సెల్ఫీ వీడియో, మొబైల్ ఫోన్‌లో లభించిన డేటా ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అది హత్యనా లేక ఆత్మహత్యనా అని తేల్చేందుకు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈనెల 10వ తేదీ అర్ధరాత్రి దైవాలగూడ గ్రామంలో రాజ్‌కుమార్ నరమేధం సృష్టించాడు. కారణంగా తనపై కక్ష పెంచుకున్నాడనే అనుమానంతో బాలిక, ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిన తర్వాత ఇంటికి వెళ్లి భార్య, ఇద్దరు పిల్లలను కూడా కిరాతకంగా చంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కేవలం అరగంట వ్యవధిలోనే 6 ప్రాణాలను బలితీసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.ఈ 6 హత్యల అనంతరం పరారైన రాజ్‌కుమార్ కోసం పోలీసులు 14 ప్రత్యేక బృందాలతో రాష్ట్రవ్యాప్తంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే 2 రోజుల తర్వాత కొత్తూరు మండలం పెంజర్ల సమీపంలోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌లో అతడి మృతదేహం లభించింది. మృతదేహం పక్కనే పురుగుమందు డబ్బా ఉండటంతో అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావించారు.ఇదిలా ఉండగా.. రాజ్‌కుమార్ మొబైల్‌లో లభించిన సెల్ఫీ వీడియో ఈ కేసులో ఇప్పుడు కీలక ఆధారంగా మారింది. వీడియోలో తనపై నమోదైన పోక్సో కేసు, వ్యక్తిగత జీవితంలో ఎదురైన పరిణామాలను ప్రస్తావిస్తూ హత్యలు చేసిన తర్వాత తాను కూడా ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పినట్లు సమాచారం. అలాగే 4 పేజీల లేఖ కూడా వెలుగులోకి రావడంతో పోలీసులు వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. రాజ్‌కుమార్ మరణం పూర్తిగా ఆత్మహత్యేనా లేక ఇందులో ఇతర కోణాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై పోలీసులు సమగ్ర విచారణ కొనసాగిస్తున్నారు. సెల్ఫీ వీడియోలో ప్రస్తావించిన వ్యక్తులను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.