హైదరాబాద్‌ను చూస్తే అసూయగా ఉంది.. ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలపై దుమారం

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చకు దారితీశాయి. హైదరాబాద్ అభివృద్ధి, రాష్ట్ర విభజన, అమరావతి నిర్మాణం అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కొత్త రాజకీయ వాదనలకు కారణమవుతున్నాయి. దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసిన మంగళగిరి రైల్వే స్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రసంగించిన నారా లోకేష్.. హైదరాబాద్ అభివృద్ధి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి కారణం అవుతున్నాయి. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 60 ఏళ్ల పాటు ఎంతో కష్టపడి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని.. అయితే 2014 రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను కట్టుబట్టలతో బయటకు పంపించారని పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ అభివృద్ధిని చూస్తుంటే తనకు అసూయగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను గుర్తు చేశారు. ఆ సమయంలో ఎదురైన పరిస్థితులే తనలో పట్టుదలను, కసిని పెంచాయని లోకేష్ పేర్కొన్నారు. అదే కసి, అదే స్ఫూర్తితో అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని నారా లోకేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులు, ఉద్యోగాల కేంద్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని.. మరో 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల యువతే ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి తీసుకొస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధాని నిర్మాణాన్ని గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు నిలిపివేసిందని నారా లోకేష్ తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం రాజధాని అమరావతి అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్‌ను మించిన ఆర్థిక, సాంకేతిక కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. నారా లోకేష్ చేసిన హైదరాబాద్‌ను చూస్తే అసూయగా ఉంది.. కట్టుబట్టలతో బయటకు పంపించారు అనే వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లతో విస్తృత చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా.. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.