ఆర్సీబీ హెడ్ కోచ్ సంచలన ప్రకటన..!

Wait 5 sec.

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు టెస్ట్ హెడ్ కోచ్ పదవి రేసు నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రధాన కోచ్ తప్పుకున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. గత వారం ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ బాధ్యతల నుంచి బ్రెండన్ మెక్‌కల్లమ్ వైదొలిగిన సంగతి తెలిసిందే. అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ.. ఆండీ ఫ్లవర్‌తో పలుమార్లు చర్చలు జరిపారు! దీంతో ఈ రేసులో ఫ్లవర్ అందరికంటే ముందంజలో ఉన్నాడని అంతా భావించారు. కానీ తాను ఈ రేసులో ఉండటం లేదని, ఐపీఎల్‌లో ఆర్సీబీ జట్టుతో పాటు 'ది హండ్రెడ్' టోర్నీలో లండన్ స్పిరిట్ జట్టు కోచ్‌గా మాత్రమే కొనసాగుతానని ఫ్లవర్ శుక్రవారం స్పష్టం చేశాడు.ఆండీ ఫ్లవర్ గతంలో 2009 - 2014 మధ్య కాలంలో ఇంగ్లాండ్ జట్టుకు హెడ్‌కోచ్‌గా పని చేసి విజయాలు అందుకున్నాడు. ఆ సమయంలో మూడు సార్లు యాషెస్ సిరీస్ గెలవడంతో పాటు భారత్‌లో కూడా టెస్ట్ సిరీస్ విజయాన్ని జట్టుకు అందించాడు. అతడి ట్రాక్ రికార్డును దృష్టిలో ఉంచుకుని ఈసీబీ ఒక వినూత్నమైన ప్రతిపాదనను కూడా ముందుకు తెచ్చింది. అతను ఆర్సీబీ కోచ్‌గా ఉంటూనే, ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ బాధ్యతలను కూడా నిర్వర్తించవచ్చని (జాబ్-షేరింగ్) బోర్డు ఆఫర్ ఇచ్చింది. కానీ ఐపీఎల్ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్ హోమ్ సీజన్ ప్రారంభం అవుతుందని, అంత తక్కువ సమయంలో రెండు కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం సాధ్యం కాదని ఫ్లవర్ ఈ ఐడియాను తోసిపుచ్చాడు.ప్రస్తుతానికి తాను చేస్తున్న ఫ్రాంచైజీ కోచింగ్ బాధ్యతలతో ఎంతో సంతృప్తిగా, సంతోషంగా ఉన్నానని ఆండీ ఫ్లవర్ తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు ఇప్పుడే తిరిగి రావాలనే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. ఒకవేళ తాను ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్‌గా ఉంటే, ఇంగ్లాండ్ దేశవాళీ క్రికెట్ ఆటగాళ్లను నిరంతరం గమనిస్తూ వారితో ప్రయాణించాల్సి ఉంటుందని, ఐపీఎల్ సమయంలో యూకేలో ఉండటం కుదరదు కాబట్టి రెండు పనులు చేయడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చాడు. గతంలో ఇంగ్లాండ్ జట్టుతో గడిపిన కాలం ఎంతో అద్భుతమైనదని, కానీ ప్రస్తుతానికి తాను లండన్ స్పిరిట్, ఆర్సీబీ జట్లతోనే ముందుకు సాగుతానని తేల్చి చెప్పాడు. ఆండీ ఫ్లవర్ నో చెప్పడంతో టెస్ట్ హెడ్ కోచ్‌ను నియమించేందుకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే మిగిలింది. ఆగస్టు 19 నుంచి పాకిస్తాన్‌తో ప్రారంభం కాబోయే మూడు టెస్టుల సిరీస్ లోపు కొత్త కోచ్‌ను వెతకడం బోర్డుకు సవాలుగా మారింది. ప్రస్తుతం కొత్త కోచ్ రేసులో చెన్నై సూపర్ కింగ్స్‌తో సుదీర్ఘ అనుబంధాన్ని ముగించుకున్న స్టీఫెన్ ఫ్లెమింగ్, లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు జోనాథన్ ట్రాట్, కుమార సంగక్కర పేర్లను కూడా ఈసీబీ పరిశీలిస్తోంది.