భారత క్రికెట్ అభిమానులకు ఊహించని షాకింగ్ వార్త బయటకు వచ్చింది. టీమిండియా స్టార్ ఓపెనర్, డాషింగ్ బ్యాటర్ అంతర్జాతీయ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే టెస్ట్, టీ20లకు రోహిత్ గుడ్ బై చెప్పాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో చారిత్రాత్మక లార్డ్స్ వేదికగా జరగబోయే వన్డే మ్యాచ్ రోహిత్ శర్మ కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయ్యే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై సెలెక్టర్లు ఇప్పటికే అతడితో మాట్లాడి భవిష్యత్తు ప్రణాళికలపై పూర్తి స్పష్టత ఇచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 2027 లో జరిగే వన్డే ప్రపంచకప్ కోసం సరికొత్త యువ జట్టును సిద్ధం చేయాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం.భారత సెలెక్షన్ కమిటీ 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మకు చోటు లేదని తేల్చి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన వెంటనే కొత్త ఓపెనర్లను నిలకడగా పరీక్షించాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. అందుకే ఈ ప్రతిష్టాత్మక సిరీస్ తర్వాత రోహిత్ శర్మను వన్డే జట్టు నుంచి పూర్తిగా పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నా.. జట్టు భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా.. ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు నివేదికలు తెలిపాయి.ఫిట్‌నెస్‌పై రోహిత్ ప్రత్యేకంగా శ్రమించినా కూడా సెలెక్టర్లు మాత్రం.. వన్డే ప్రపంచకప్ 2027 నాటికి యంగ్ ఓపెనర్‌తో బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. యశస్వి జైశ్వాల్‌తో కలిసి గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. సెలెక్టర్ల నిర్ణయంతో రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తుపై తీవ్ర సందిగ్ధత నెలకొంది.అయితే భవిష్యత్తులో ఆట నుంచి ఎలా తప్పుకోవాలనే విషయాన్ని పూర్తిగా రోహిత్ శర్మ వ్యక్తిగత నిర్ణయానికే సెలక్టర్లు వదిలేశారట. దీనిపై హిట్ మ్యాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఇప్పుడు కోట్లాది మంది ఫ్యాన్స్‌లో ఆసక్తికరంగా మారింది. జులై 19న భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా మూడో వన్డే జరగనుంది.