అంతర్జాతీయ టెక్ కంపెనీల్లో తమ కలల కొలువు సాధించాలంటే.. ప్రతిష్ఠాత్మక ఐఐటీ నుంచి డిగ్రీ ఉంటేనే సాధ్యమని ఇంజినీరింగ్ విద్యార్థులు భావిస్తారు. కానీ, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఓ యువకుడు.. ఈ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేశాడు. కనీస రవాణా సౌకర్యాలు కూడా లేని మారుమూల గ్రామానికి చెందిన అతడు.. నిరంతర కృష్టి, పట్టుదల, అభ్యాసం, నైపుణ్యాలు ఉంటే ఐఐటీ డిగ్రీలతో సమానంగా విజయాలు సాధించవచ్చని నిరూపించాడు. ఏకంగా రూ. 2.6 కోట్ల వార్షిక ప్యాకేజీతో కలల కొలువును సాధించిన కర్ణాటక యువకుడు పృథ్విరాజ్ ప్రకాశ్ స్ఫూర్తిదాయక ప్రయాణం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలోని ప్రధాన కార్యాలయంలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్‌‌గా చేరినట్టు ఇటీవల పృథ్విరాజ్ లింక్డిన్‌ వేదికగా వెల్లడించాడు. దీంతో కేవలం ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదివితేనే కలల కొలువు లభిస్తుందని నమ్మే వేలాది మంది విద్యార్థులకు ఆయన సాధించిన ఈ విజయం ఎంతో స్ఫూర్తిగా నిలిచి, ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన పృథ్విరాజ్ స్వస్థలం కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలోని కాటమదేవరకోటే అనే మారుమూల గ్రామం. అక్కడ అత్యాధునిక సాంకేతికత, ఉన్నత విద్యకు అవకాశాలు చాలా పరిమితంగా ఉండేవి. తండ్రి బ్యాంకు ఉద్యోగి కాగా.. ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు లేకపోయినా కేవలం తన పట్టుదల, స్వయంకృషితోనే కెరీర్‌ను నిర్మించుకున్నారు. లింక్డిన్‌లో తన విజయ ప్రస్థానాన్ని పంచుకుంటూ. ‘‘ఒక చిన్న పట్టణంలో ఒక నిశ్శబ్దంగా మొదలైన నా కల.. ఇప్పుడు నిజమైంది.’’ అని అన్నారు.టెక్నాలజీ అందుబాటులో లేని ప్రాంతంలో పెరగడం వల్ల ఆ కల దాదాపు అసాధ్యంగా అనిపించిందని అతడు తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. అనేక ఎదురుదెబ్బలు, తనపై తనకే సందేహాలు ఎదురైనప్పటికీ, తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనే నిబద్దతతో ముందుకు సాగారు. ఖరీదైన కోచింగ్ ప్రోగ్రామ్‌లు లేదా కాలేజీ ప్రతిష్టపై ఆధారపడకుండా.. ఆన్‌లైన్ కోర్సులు, వ్యక్తిగత ప్రాజెక్టులు, నిరంతర సాధన ద్వారా ఏఐ, డీప్ లెర్నింగ్‌ను స్వయంగా నేర్చుకున్నట్టు పృథ్వీరాజ్ వెల్లడించారు.బెంగళూరులోని పీఈఎస్ యూనివర్సిటీలో బీటెక్ పూర్తయిన తర్వాత ఎంఎస్ కోసం అమెరికాలోని ఓ సాధారణ యూనివర్సిటీలో చేరారు. ఆ సమయంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న పృథ్వీ.. చదువు, కెరీర్ ప్లానింగ్ వంటి విషయాల్లో సరైన మార్గదర్శకత్వం లేక అన్నీ ఒంటరిగానే మేనేజ్‌ చేసుకోవాల్సి వచ్చింది. ఇటువంటి సవాళ్లు ఎదురైనప్పటికీ నిరంతరం సాంకేతిక పరిజ్ఞానాన్ని పదునుపెట్టుకుంటూనే ఉన్నారు. ఎంఎస్ తర్వాత ఎన్‌విడియా కఠినమైన ఇంటర్వ్యూను విజయవంతంగా పూర్తిచేసి ఉద్యోగం సాధించారు.ప్రస్తుతం ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో అత్యాధునిక డీప్ లెర్నింగ్ టెక్నాలజీపై విధులు నిర్వహిస్తున్న పృథ్వీరాజ్.. ఏడాదికి 2,75,000 డాలర్లు (రూ. 2.6 కోట్ల) వేతనం ఆర్జిస్తున్నాడు. ఎన్‌విడియాలో చేరడంతోనే తన కల సాకారమైందని, ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులైన మేధావులతో కలిసి అత్యాధునిక ఏఐ సాంకేతికతలపై పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.‘‘విజయం ఎంత దూరంలో ఉన్నట్లు అనిపించినా.. నిరాశపడకుండా మీ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ సహనంతో ముందుకు సాగండి.. ఎప్పటికీ పట్టుదల వదలకండి’’ అని తమ అతడు స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు.పలువురు అతడి పోస్ట్‌పై స్పందించారు. ‘‘సమాజంలోని పేదరికం, వెనుకబాటుతనం నుంచి బయటపడి, ఉన్నత ఆర్థిక స్థాయికి చేరుకోవడానికి విద్యే ఇప్పటికీ ఏకైక మార్గం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల విద్యారంగంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనే చర్చలు జరుగుతున్నప్పటికీ.. విద్య ప్రాముఖ్యత. దాని ప్రభావం ఎప్పటికీ తగ్గవు’’ అని ఒకరు.. ‘‘నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం! మన నేపథ్యం కంటే మన నిబద్ధత, నేర్చుకోవాలనే తపన, పట్టుదలే అత్యంత ముఖ్యమని ఈ విజయం నిరూపించింది. గొప్ప కలలు కనే ప్రతి విద్యార్థికీ ఇది ఎంతో గర్వకారణమైన క్షణం. పృథ్వీరాజ్‌కు నా హృదయపూర్వక అభినందనలు, భవిష్యత్తుకు శుభాకాంక్షలు!’’ ఇంకొకరు కామెంట్ పెట్టారు.