విజయవాడ భక్తుడి పెద్దమనసు.. టీటీడీకి భారీ విరాళం..

Wait 5 sec.

తిరుమల శ్రీవారికి మరో భారీ విరాళం అందింది. విజయవాడకు చెందిన ఓ భక్తుడు టీటీడీకి కోటి రూపాయలు విరాళం అందించారు. విజయవాడకు చెందిన అన్ బ్లిక్స్ క్లౌడ్ డేటా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈవో తిరుమల కుమార్ కనకమేడల.. టీటీడీ శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందజేశారు. ఈ మేరకు సోమవారం రోజున శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంను కలిసి విరాళం డీడీలను అందజేశారు.జూలై 22న తిరుమలలో పల్లవోత్సవంతిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 22న టీటీడీ పల్లవోత్సవాన్ని ఘనంగా నిర్వహించనుంది. మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని పల్లవోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సహస్రదీపాలంకారసేవ అనంతరం.. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి తీసుకువస్తారు. ఈ సమయంలో కర్ణాటక రాష్ట్రం తరుఫున ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పిస్తారు.మరోవైపు మైసూరు మహారాజు జ్ఞాపకార్థం సుమారు 300 సంవత్సరాల నుంచి.. తిరుమలలో పల్లవోత్సవం నిర్వహిస్తూ వస్తున్నారు.. మొదట్లో ఈ ఉత్సవాన్ని తోటోత్సవం అని పిలిచేవారు. ఈ ఉత్సవంలో కర్ణాటక సత్రాలకు విచ్చేసిన స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించిన అనంతరం, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు. మరోవైపు శ్రీవారికి పరమ భక్తుడైన మైసూరు మహారాజు.. దేవస్థానానికి అనేక భూరి విరాళాలు అందించారు. బ్రహ్మోత్సవాలలో శ్రీవారి సేవలకు ఉపయోగించే గరుడ వాహనం, గజ, ముత్యపుపందిరి వాహనం, సర్వభూపాల, అశ్వ, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలను మైసూరు రాజు అందజేశారు. పల్లకీ ఉత్సవంలో ఉపయోగించే పల్లకీని ప్రత్యేకంగా తయారుచేసి అందించారు. ఈ నేపథ్యంలో ఆయన జ్ఞాపకార్ధం పల్లవోత్సవం నిర్వహించడం ఆనవాయితీ..