తెలంగాణలో మద్యం ధరల పెంపు.. ఎల్లుండి కీలక నిర్ణయం.. మందు బాటిల్ సైజు తగ్గించే యోచన..!

Wait 5 sec.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరల నిర్ణయ కమిటీ జూలై 17వ తేదీన కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో తెలంగాణలో మద్యం ధరల పెంపుతోపాటు.. ఉన్నట్లు అధికార వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. ఇందులో భాగంగా ఇప్పటికే ధరల నిర్ణయ కమిటీ మద్యం తయారీ సంస్థలు, డిస్టిలరీలు, పరిశ్రమల సంఘాల ప్రతినిధులతో దాదాపు 10 దఫాలుగా సమావేశాలు నిర్వహించింది. ఉత్పత్తి వ్యయం, ముడి పదార్థాల ధరలు, రవాణా ఖర్చులు, పన్నుల ప్రభావం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. గాజు సీసాలు, ప్యాకేజింగ్ మెటీరియల్, స్పిరిట్, కార్మికుల వ్యయాలు, రవాణా ఖర్చులు గణనీయంగా పెరగడంతో ప్రస్తుతం ఉన్న ధరల్లో వ్యాపారం కొనసాగించడం కష్టంగా మారిందని తయారీ సంస్థలు కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.ఈనెల 17వ తేదీన జరిగే సమావేశంలో మద్యం ధరలను ఎంత మేర సవరించాలి.. ఏయే బ్రాండ్లపై ఎంత మేర పెంపు ఉండాలి.. ఎప్పటి నుంచి కొత్త ధరలను అమల్లోకి తీసుకురావాలి వంటి అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే ప్రీమియం, మిడిల్, ఎకానమీ బ్రాండ్లకు వేర్వేరుగా ధరలు నిర్ణయించే అంశంపైనా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. మద్యం ధరలు 10 శాతం నుంచి 20 శాతం వరకు ధరల వరకు పెంపు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని కొన్ని నివేదికల ద్వారా ప్రచారం జరుగుతున్నప్పటికీ.. దీనిపై ప్రభుత్వం ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.ధరల సవరణతో పాటు మద్యం బాటిళ్ల పరిమాణాల్లో మార్పులు తీసుకురావాలన్న ప్రతిపాదన కూడా ఈ కమిటీ పరిశీలనలో ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న బాటిళ్లతో పాటు 150 మిల్లీలీటర్ల (150 ఎంఎల్) కొత్త సైజు బాటిళ్లను మార్కెట్లోకి తీసుకురావాలని కొన్ని మద్యం తయారీ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే.. ప్రస్తుతం ఉన్న బాటిళ్లతోపాటు 150 ఎంఎల్ సైజు బాటిళ్లు కూడా మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే తుది నిర్ణయం మాత్రం ధరల నిర్ణయ కమిటీ సమావేశం తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ఉత్తర్వుల ఆధారంగానే స్పష్టత రానుంది.