ఆంధ్రప్రదేశ్‌లో బీఎల్‌వోలు, సూపర్ వైజర్లకు శుభవార్త.. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నిర్ణయం మేరకు వీరి జీతాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఏపీ సీఈవో వివేక్ యాదవ్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో ప్రతి బీఎల్‌వో & సూపర్ వైజర్‌కు అదనంగా రూ. 6,000 వన్-టైమ్ బోనస్ మంజూరు చేశారు. బీఎల్‌వోలకు మొత్తం రూ. 18,000, సూపర్ వైజర్లకు మొత్తం రూ. 24,000 వస్తాయని చెబుతున్నారు. బీఎల్‌వోలకు రూ. 18,000 (12,000 + 6,000) కు చేరుకుంటుంది. సూపర్ వైజర్లకు మొత్తం రూ. 24,000 (18,000 + 6,000) అందనుంది. స్పెషల్ ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ (SIR) అదనపు విధులకు గుర్తింపుగా ఈ వేతనాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. ఈ డబ్బుల్ని నేరుగా బ్యాంక్ అకౌంట్‌లలోకి జమ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.వాస్తవానికి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విధులు నిర్వర్తించే బీఎల్‌వోలకు ప్రతి ఏడాదికీ రూ. 6వేల గౌరవ వేతనం చెల్లించేవారు. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి ఆ గౌరవ వేతనాన్ని రూ. 12వేలు (డబుల్‌)చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ‘సర్‌’ ప్రక్రియలో పాల్గొంటున్నందుకు అదనంగా వీరికి రూ. 6వేల గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. సూపర్ వైజర్లకు కూడా అదనంగా రూ. 6వేల చొప్పున అందిస్తారు. SIR విధుల్లో ఉన్న బీఎల్‌వోలు, సూపర్‌వైజర్‌లకు రూ. 6,000 ఒకేసారి గౌరవ వేతనాన్ని ECI ప్రకటించింది. దీంతో వారికి కొంత ఊరట దక్కిందని చెప్పాలి.ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ డామన్ అండక డయ్యూ, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఢిల్లీ, ఒడిశా, పంజాబ్, సిక్కిం, తెలంగాణ, త్రిపుర మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆదేశించారు. 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో 36 కోట్లకు పైగా ఓటర్లకు సర్ ప్రక్రియను చేపట్టారు. ఓటర్ల ఇంటింటి ధృవీకరణ కోసం సుమారు 3.94 లక్షల బూత్ స్థాయి అధికారులను నియమించారు. ఓటర్లు, ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో ఈ సవరణ చేపట్టారు.