Vijayawada: యూకేలో డ్రగ్స్‌కు బానిసై ఇండియాకు.. ఇక్కడ కూడా అదే పని చేస్తూ అడ్డంగా దొరికాడు

Wait 5 sec.

పెద్ద పెద్ద చదువులు చదువుతానంటూ ఇంగ్లండ్‌కు వెళ్లాడు. విదేశాలకు వెళ్లాడు ఉన్నత ఉద్యోగం చేస్తాడు అనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాసలు అయ్యాయి. యూకేకి వెళ్లిన తర్వాత డ్రగ్స్‌కు బానిసైన ఆ యువకుడు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేశాడు. ఆరేళ్లు అక్కడుండి వీసా గడువు ముగియడంతో స్వదేశానికి వచ్చాడు. ఇక్కడికి వచ్చినా ఆ డ్రగ్స్‌ను మాత్రం వదల్లేక పోయాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన విజయవాడ ప్రసాదంపాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ప్రసాదంపాడుకు చెందిన బాలసాయి శ్రావణ్ కుమార్ బీటెక్ చదివి, విదేశాల్లో ఎంఎస్ చేయాలని అనుకున్నాడు. తల్లిదండ్రులకు కూడా ఇదే చెప్పడంతో వారు కూడా అంగీకరించాడు. 2020లో యూకేకి వెళ్లిన శ్రావణ్ ఆరేళ్ల పాటు అక్కడ ఉండి ఇటీవలే వీసా గడువు ముగియడంతో ఇంటికి వచ్చాడు. చదువుకునే సమయంలోనే డ్రగ్స్‌కు అలవాటు పడి జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. READ ALSO ఇంటికి వచ్చిన తర్వాత కూడా డ్రగ్స్ లేకుండా ఉండలేకపోయాడు. ఎలాగైనా ఎండీఎంఏ డ్రగ్ తెచ్చుకోవాలి అనుకున్నాడు. బెంగళూరులో దొరుకుతుందని తెలియడంతో కారు తీసుకుని మరీ వెళ్లాడు. అక్కడ డ్రగ్స్ ముఠా దగ్గర ఎండీఎంఏను కొనుగోలు చేసి విజయవాడకు బయల్దేరాడు. బెంగళూరు నుంచి విజయవాడకు డ్రగ్స్ తీసుకొస్తున్నాడు అనే సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమవయ్యారు. గవర్నర్‌పేట ఎస్సై నిఘా ఉంచారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గోపాలకృష్ణయ్య వీధిలోని ఓ ఆస్పత్రి వద్ద తనిఖీలు చేపట్టగా అక్కడో నలుపు రంగు కారు అనుమానాస్పదంగా కనిపించింది. డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వెంటాడి మరి కారును అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న బాలసాయి శ్రావణ్ కుమార్‌ను పట్టుకుని కారులో ఐదు ప్యాకెట్లలో దొరికిన 26.38 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. శ్రావణ్ కుమార్ కేవలం తాను వాడుకోవడానికే కాకుండా విజయవాడలో విక్రయించేందుకు బెంగళూరు నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బెంగళూరులో ఎవరి వద్ద నుంచి ఈ సరుకు తెస్తున్నాడు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రావణ్‌ను కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారు.