కుప్పకూలిన దిగ్గజ టెక్ కంపెనీ స్టాక్- ఒక్కరోజే 26 శాతం పతనం- రూ. 6.7 లక్షల కోట్ల లాస్!

Wait 5 sec.

: అమెరికాకు చెందిన మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఐబీఎం షేర్లు జులై 14 సెషన్‌లో దారుణంగా పతనం అయ్యాయి. 39 ఏళ్ల రికార్డుల్ని బద్దలు కొడుతూ ఈ స్టాక్ మంగళవారం సెషన్‌లో ఏకంగా 26 శాతం పడిపోయింది. చివరిసారిగా 1987, అక్టోబర్ 19న ఈ స్టాక్ 23.7 శాతం పడిపోగా ఇప్పుడు అంతకుమించి కుదేలైంది. కిందటి రోజు 290.23 డాలర్ల వద్ద ముగిసిన స్టాక్ ఇప్పుడు ఒక్కసారిగా కుదేలైంది. ఇంట్రాడేలో ఒక దశలో 27 శాతం వరకు పతనమై 213.22 డాలర్ల వద్ద తాకినా చివరకు 26 శాతం వరకు నష్టంతో 217.07 డాలర్ల వద్ద స్థిరపడింది. ఇక ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే మార్కెట్ విలువ ఒక్క సెషన్‌లోనే రికార్డు స్థాయిలో 70 బిలియన్ డాలర్ల వరకు తగ్గింది. ఇది భారత కరెన్సీలో చూస్తే రూ. 6.7 లక్షల కోట్లకుపైనే ఉంటుంది. దీంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారని చెప్పొచ్చు. అసలు ఈ ఐబీఎం స్టాక్ భారీ పతనానికి దారి తీసిన పరిస్థితులేంటో చూద్దాం. ముందుగా క్యూ2 త్రైమాసిక ఫలితాలకు సంబంధించి కంపెనీ ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ఇక్కడ ఆదాయం 17.2 బిలియన్ డాలర్లుగా నమోదవొచ్చని అంచనా వేసింది. అయితే ఇది వాల్ స్ట్రీట్ అంచనాల కంటే చాలా తక్కువ. వాల్ స్ట్రీట్ విశ్లేషకులు సుమారు 17.9 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా ఆ అంచనాలు తప్పాయి. ఇంకా లాభాలు కూడా ఆశించిన స్థాయిలో లేవని తెలిసింది. కంపెనీ వాస్తవ ఫలితాల్ని వచ్చే వారం ప్రకటించనుంది. దీనికి తోడు స్వయంగా కంపెనీ సీఈఓ అర్వింద్ కృష్ణ ఇన్వెస్టర్లకు ఒక లేఖ రాసి తాము విఫలం అయ్యామని ఒప్పుకున్నారు. 'పరిస్థితులు మా అంచనాల కంటే దారుణంగా ఉన్నాయి. మారుతున్న మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా మేం వేగంగా మారలేకపోయాం.' అని ప్రకటించడం ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసింది.Read Also: ఇతర కారణాలు చూస్తే ప్రస్తుతం మార్కెట్లో ఏఐ హార్డ్‌వేర్‌కు (చిప్స్, మెమొరీ, సర్వర్స్) మంచి డిమాండ్ ఉంది. భవిష్యత్తులో వీటి ధరలు పెరుగుతాయనే భయంతో పెద్ద పెద్ద కంపెనీలన్నీ తమ బడ్జెట్‌ను ఐబీఎం ఇచ్చే సాఫ్ట్‌వేర్, మెయిన్‌ఫ్రేమ్ సేవల నుంచి మళ్లించి, ఏఐ హార్డ్‌వేర్ కొనుగోలు చేసేందుకు ఖర్చు చేశాయి. ఈ మార్పును కూడా ఐబీఎం ముందే అంచనా వేయలేకపోయింది. ఆంథ్రోపిక్ సంస్థ కొత్తగా తెచ్చిన ఏఐ మోడల్ మైథోస్ వల్ల కంపెనీల్లో సైబర్ సెక్యూరిటీ లోపాల్ని హ్యాకర్లు సులభంగా పసిగట్టే ప్రమాదం ఉందన్న భయాలు కూడా టెక్ కంపెనీల్లో మొదలయ్యాయి. దీంతో అలర్ట్ అయిన క్లయింట్స్ ఐబీఎంతో జరగాల్సిన కొన్ని పెద్ద డీల్స్‌ను ఆఖర్లో వాయిదా వేసుకున్నారు. ఇవన్నీ ఒక్కసారిగా స్టాక్ కుదేలయ్యేందుకు కారణమయ్యాయని చెబుతున్నారు.