Tenali: హమ్మయ్యా ఆ కేటుగాళ్లు దొరికేశారు.. పోలీసులం బండి చెక్‌ చేయాలంటూ దోచేశారు.. మొత్తానికి పట్టుబడ్డారు

Wait 5 sec.

ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వస్తారు.. చూడటానికి పోలీసుల్లాగే ఉంటారు. మఫ్తీలో ఉన్నాం పోలీసులం గంజాయి ఉందేమో చెక్ చేయాలంటూ బండి ఆపేస్తారు. చెక్ చేస్తున్నట్టే చేసి జేబుల్లో ఎంత ఉంటే అంత దోచేస్తారు. ఇలా ఒక్కళ్లు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది వీళ్ల బారిన పడ్డట్టే. ఇటీవల వరుస ఫిర్యాదులు రావడంతో పోలీసులు నిఘా పెట్టి ఆ ఇద్దరు కేటగాళ్లను పట్టేసుకున్నారు. పోలీసుల వివరాల మేరకు.. చీరాలకు చెందదిన కిరణ్ కుమార్, మురళీలు స్నేహితులు. ఇందులో మురళీ గతంలో బీఎస్ఎఫ్‌లో పనిచేసి బయటకు వచ్చేశాడు. అయితే వ్యసనాలకు బానిసైన మురళీ తన చిన్ననాటి స్నేహితుడైన కిరణ్ కుమార్‌తో కలిసి సులభ పద్ధతిలో డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు. చూడటానికి పోలీసుల్లా ఉండటంతో రోడ్డుపై వెళ్లేవారిని పోలీసులం అని బెదిరించి నగదు దోచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే జూలై 7వ తేదీ మధ్యాహ్నం ఆటోనగర్ ప్రాంతంలో బైక్‌పై వెళ్తున్న ఓ వృద్ధుడిని ఆపి బైక్ చెక్ చేయాలని చెప్పారు. పోలీసులమని బెదిరించి అతని దగ్గర రూ. 50 వేలు, అదే రోజు దుగ్గిరాల వద్ద మరో వృద్ధుడిని చెక్ చేస్తున్నట్లు చేసి అతని నుంచి రూ. 7 వేలు దోచుకున్నారు. దాంతో తెనాలి - మంగళగిరి రోడ్డులో దుగ్గిరాల వద్ద ఇలా బెదిరించి డబ్బులు దోచేస్తున్నారు అని పోలీసులకు ఫిర్యాదు అందించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పాత నేరస్థుల్లో ఈ తరహా నేరాలు చేసే వారి చిత్రాలను బాధితులకు చూయించారు. అదేవిధంగా దొంగతనం జరిగిన రూట్లలో సీసీ కెమెరాల ఫుటేజీని కూడా పరిశీలించారు. మొత్తానికి ఈ దొంగతనాలకు పాల్పడుతుంది చీరాలకు చెందిన కిరణ్ కుమార్, మురళీలు అని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు వారి నుంచి రూ. 57 వేల నగదు, ఒక బైక్‌ను సీజ్ చేశారు. ఇందులో కిరణ్ కుమార్‌పై ఇప్పటికే 12 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఐదు కేసులు ఇదే తరహాలో పెద్ద వయస్సు ఉన్న వారిని దోచుకున్నవి కాగా.. ఒకటి అత్యాచారం, ఇతర కేసుల్లో పలుమార్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. ఇతనిపై గుంటూరు, చీరాల, వేటపాలెం, ఇంకొల్లు, ఒంగోలు, నందిగామ ప్రాంతాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. బీసీఎఫ్ నుంచి బయటకు వచ్చిన మురళీ కూడా ఇతనితో చేతులు కలపడంతో ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు.