ఏపీలో కరోనా కేసులు.. ఆర్‌ఎఫ్‌.5 వేరియంట్‌‌గా గుర్తింపు, ఈ లక్షణాలు ఉంటాయి.. ప్రజలకు అలర్ట్

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. జూన్ 26 నుంచి జులై 16 వరకు రాష్ట్రంలో 12 కొవిడ్ కేసులునమోదైనట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఒకే చోట కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో బయటపడ్డాయి. తాజాగా ఈ కరోనా కేసులకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. కరోనా కేసులకు సంబంధించి శాంపిల్స్ పుణె వైరాలజీ ల్యాబ్‌కు పంపించగా.. వాటిలో నాలుగు ఫలితాలు బయటపడ్డాయి. ఈ కరోనా కేసులకు సంబంధించి ఒమిక్రాన్‌ ఆర్‌ఎఫ్‌.5 వేరియంట్‌ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఆర్‌ఎఫ్‌.5 కేసులు ఎక్కువగా సింగపూర్‌, ఆగ్నేయాసియా దేశాల్లో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతుండటంతో తాజా పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అధికారులతో సమీక్ష నిర్వహంచారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. పుణె ల్యాబ్ గుర్తించిన చి ఒమిక్రాన్‌ ఆర్‌ఎఫ్‌.5 వేరియంట్‌‌ను డబ్ల్యూహెచ్‌వో (ప్రపంచ ఆరోగ్య సంస్థ) ఈ వేరియంట్‌ను నిశితంగా పరిశీలిస్తోందన్నారు డీఎంఈ విష్ణువర్థన్‌. ఆర్‌ఎఫ్‌-5 ఇతర ఒమిక్రాన్‌ వేరియంట్లతో పోలిస్తే ప్రమాదకరం కాదని.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాలు పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందన్నారు. ఈ వేరియంట్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు అధికారులు. ఆర్‌ఎఫ్‌-5 లక్షణాలు ఇతర ఒమిక్రాన్‌ సబ్ వేరియంట్ల లక్షణాలలాగే ఉంటాయంటున్నారు. ఈ వేరియంట్‌ లక్షణాల్లో.. ముఖ్యంగా గొంతునొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, అలసట, ఒంటి నొప్పులు ఉంటాయంటున్నారు. పరీక్షలకు అవసరమైన కిట్లు, ఇతర మౌలిక వసతుల్ని సమకూరుస్తున్నామని.. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 16 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయంటున్నారు. మరోవైపు తాజాగా మరో రెండు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో 3 ఏళ్ల బాలుడికి, ఎన్టీఆర్‌ జిల్లాలో 13 ఏళ్ల బాలికకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. నెల్లూరు జిల్లాకు చెందిన బాలుడికి క్యాన్సర్‌ ఉంది.. ఈ నెల 13న అతడికి చికిత్స కోసం కుటుంబసభ్యులు పుదుచ్చేరికి తీసుకువెళ్లారు. అక్కడి డాకర్లు బాలుడికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌ వచ్చింది. ఈ సమాచారం తెలియడంతో నెల్లూరు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు బాలుడితో పాటుగా తల్లిదండ్రులు, బంధవులకు పరీక్షలు నిర్వహించారు.. వారికి నెగిటివ్ వచ్చింది. అలాగే ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిర 13 ఏళ్ల బాలికకు కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. ఆమెకు విజయవాడ జీజీహెచ్‌లో డయాలసిస్‌ చేయిస్తుండగా.. ఆ బాలిక జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులతో బాధపడుతోంది. ఆమెకు డాక్టర్లు ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేసి పాజిటివ్‌ రావడంతో వెంటనే ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చింది.