‘ఇథనాల్ పెట్రోల్.. బీజేపీకి రెడ్ సిగ్నల్’: నటుడు నరేశ్ సంచలన పోస్ట్

Wait 5 sec.

పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో అప్రమత్తమైన భారత ప్రభుత్వం ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో E20 పెట్రోల్ లభ్యం అవుతోంది. అయితే 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల మైలేజీ తగ్గిందని, తమ వాహనాల ఇంజిన్లు పాడవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. అయితే కేంద్రం మాత్రం ఇథనాల్ కలపడాన్ని సమర్థించుకుంటోంది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల వాహనాలు దెబ్బతింటాయనే ప్రచారం శుద్ధ తప్పు అని.. ఈ20 పెట్రోల్ వద్దనుకుంటే శుద్ధ పెట్రోల్ కొనుగోలు చేయాలని . ఇథనాల్ బ్లెండింగ్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు వేల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతాయని కేంద్రం చెబుతోంది.ఇథనాల్ కలిపిన పెట్రోల్ విషయమై ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న వేళ.. సీనియర్ నటుడు, ఒకప్పటి బీజేపీ నేత నరేశ్ కూడా స్పందించారు. ‘‘నేనేమీ దేశ ద్రోహిని కాదు, కానీ బైక్‌లు వాడుతున్న వారి నుంచి హై ఎండ్ కార్ల యజమానుల వరకు అందరికీ గుండెపోటు తెప్పిస్తోంది. బీజేపీ సానుభూతిపరుడైన నా స్నేహితుడు టయోటా కామ్రీ కొనుగోలు చేశాడు. ఇథనాల్ పెట్రోల్ వల్ల ఆయన కారు ఇంజిన్ వాల్వ్‌లు మార్చాల్సి వచ్చింది. ఇందుకోసం ఆయనకు రూ.3.5 లక్షలు ఖర్చయ్యింది. అదే సమస్య నా కొత్త పోర్షే పనామెరా కారుకి వస్తే.. సుమారు రూ.12 లక్షలు అవసరం. అందుకే నేను లీటర్‌కు రూ.165 చొప్పున లభించే హై-ఆక్టేన్ 100 పెట్రోల్‌కు మారాల్సి వచ్చింది. మరి బైక్‌లు వాడేవారు, ఇతర సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇదొక భయంకరమైన కల.గతంలో బీజేపీలో పని చేసిన నాయకుడిగా.. పార్టీకి ప్లాన్ ఏ, బీ అండ్ సీ లతో కూడిన బలమైన థింక్ ట్యాంక్ ఉంటుందని నాకు తెలుసు. కానీ కోట్లాది మంది ప్రజల నష్టాన్ని పణంగా పెట్టి పర్యావరణాన్ని రక్షించాలనే ఈ నిర్ణయం కచ్చితంగా హడావుడిగా, తీవ్రమైనదిగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. గత ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఒక ఇండికేషన్. ఇది బీజేపీకి రెడ్ సిగ్నల్. బ్రెజిల్ లాంటి చిన్న దేశాలు ఇథనాల్‌ను దశల వారీగా విజయవంతంగా అమలు చేశాయి. మరి మనకు తొందర ఎందుకు? ఏ వేరియంట్ పెట్రోల్‌కు ఎంత ఖరీదు అవుతుందనేది కింద పోస్టు చేశాను. ఓసారి పరిశీలించండి. జస్ట్ చెబుతున్నానంతే’’ అని నరేశ్ పోస్టు చేశారు.ఈ పోస్టు ద్వారా బీజేపీ నాయకత్వానికి నరేశ్ ఓ వార్నింగ్ ఇచ్చారనే చెప్పొచ్చు. ఇథనాల్ పెట్రోల్ విషయంలో తొందరపాటు పనికి రాదని.. కోట్లాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తన పోస్టు ద్వారా కమలనాథులకు చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తే.. దాని ప్రభావం వచ్చే ఎన్నికల ఫలితాలపై పడుతుందని.. ఇప్పటికే కేంద్రంలో మిత్ర పక్షాల సాయంతో బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతున్న విషయాన్ని మర్చిపోవద్దని ఆయన గుర్తు చేశారు. మరి ఇథనాల్ పెట్రోల్ విషయంలో బీజేపీ నేతలు తమ పట్టుదలనే కొనసాగిస్తారా? లేదా ప్రజాభీష్టానికి అనుగుణంగా అడుగులేస్తారా అనేది చూడాలి.