సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఆరోగ్య పరిస్థితి.. అక్రమంగా నిర్బంధించారని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన భార్య

Wait 5 sec.

లడఖ్‌కు చెందిన పర్యావరణ ఉద్యమకారుడు, విద్యావేత్త సోనమ్‌ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి, ఆయన ఆస్పత్రిలో చికిత్సపై దేశవ్యాప్తంగా కొత్త వివాదానికి దారి తీసింది. 21 రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్‌ను ఇటీవల ఢిల్లీ పోలీసులు సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి బలవంతంగా తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు సోనమ్ వాంగ్‌చుక్‌ భార్య గీతాంజలి ఆంగ్మో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తను వెంటనే తాము ఎంపిక చేసుకున్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.గీతాంజలి ఆంగ్మో తన పిటిషన్‌లో సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో సోనమ్‌ వాంగ్‌చుక్‌ను ట్రీట్‌మెంట్ పేరుతో అక్రమంగా నిర్బంధించారని ఆమె ఆరోపించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలని పలుమార్లు కోరినా అధికారులు నిరాకరించారని తెలిపారు. అంతేకాకుండా.. వ్యక్తిగత డాక్టర్లు, లాయర్లను కలిసేందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఆస్పత్రిలో తన భర్త ఉన్న ఫ్లోర్‌లో సుమారు 30 మంది పోలీసులు.. మొత్తం ఆస్పత్రి ప్రాంగణంలో 100 మందికి పైగా భద్రతా సిబ్బంది మోహరించారని గీతాంజలి ఆంగ్మో ఆరోపించారు. దీంతో స్వేచ్ఛగా తన భర్తను కలిసే అవకాశమే లేకుండా పోయిందని.. ఇది మెడికల్ ట్రీట్‌మెంట్ కంటే అక్రమ నిర్బంధంలా మారిందని ఆమె వాదించారు. ఈ సందర్భంగా ఆరోగ్య పరిస్థితిపైన కూడా ఆమె తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. వాంగ్‌చుక్ పొటాషియం స్థాయి 2.9కి పడిపోయిందని డాక్టర్లు చెప్పినా.. స్వతంత్ర ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షల్లో అది 3.5గా నమోదైందని ఆయన భార్య తెలిపారు. ఈ వ్యత్యాసంపై పూర్తి వైద్య రికార్డులను రియల్‌టైమ్‌లో అందించాలని హైకోర్టును కోరారు. అంతేకాకుండా సోనమ్‌ వాంగ్‌చుక్ అనుమతి లేకుండా ఎలాంటి మందులు లేదా ట్రీట్‌మెంట్ అందించకుండా ఆదేశాలు ఇవ్వాలని కూడా పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఆయన నిర్ణయం చెప్పలేని పరిస్థితిలో ఉంటే.. తన సమ్మతి తీసుకున్న తర్వాతే చికిత్స అందించాలని కోరారు. ఈ పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీస్ కమిషనర్, వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజ్, సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు విచారణ జరపనున్న నేపథ్యంలో సోనమ్‌ వాంగ్‌చుక్ ఆరోగ్యం, నిరాహార దీక్ష అంశం మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.