శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త వినిపించింది. తిరుమలలో గదుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేకుండా.. కీలక మార్పులు చేసింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు గదుల కోసం ఇబ్బంది పడకుండా విస్తృత ఏర్పాట్లు చేసింది. తిరుమలలో గదులు కావాలంటే కేంద్రీయ విచారణ కార్యాలయం (CR0) వద్ద భక్తులు గంటల కొద్దీ వేచి చూడాల్సి వచ్చేది. అయితే ఈ విధానంలో టీటీడీ మార్పులు చేసింది. భక్తుల అవస్థలు, సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ఉప విచారణ కార్యాలయాల ద్వారా కూడా భక్తులకు గదులు కేటాయించే విధానాన్ని అమలు చేస్తోంది‌.తిరుమలలో గదులు తీసుకునే విధానం..తిరుమలలో గదులు తీసుకోవాలనుకునే భక్తులు ముందుగా సీఆర్వో వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఉదయం 5 గంటల నుంచి సీఆర్వో కార్యాలయం అందుబాటులో ఉంటుంది. గదుల అందుబాటులో ఉన్నంత వరకు సీఆర్వో ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇందుకోసం భక్తులు క్యూలైన్‌లో ఎదురుచూడాల్సి ఉంటుంది. తమ వంతు వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు, లేదా జిరాక్స్ కాపీని చూపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫోన్ నెంబర్ వివరాలు తెలియజేసి గది కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత టీటీడీ సిబ్బంది.. ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తారు. తిరుమలలో గదుల రేట్లుమరోవైపు సీఆర్వో ఆఫీసులోని రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద రెండు కేటగిరీలకు సంబంధించిన గదులలో భక్తులు తమకు కావాల్సిన గదులను ఎంపిక చేసుకోవచ్చు. ఏ కేటగిరీలో రూ.50, రూ.100 గదులు.. అలాగే బీ కేటగిరీలో రూ.1000 గదులు ఉంటాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. భక్తులకు ఒక అక్‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్ అందిస్తారు. అలాగే క్యూలైన్ల వద్ద భక్తులకు తాగునీరు, అన్న ప్రసాదం, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. తిరుమలలో గదుల కోసం మార్గదర్శకాలుతిరుమలలో గదులు పొందేందుకు 21 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. ఒకసారి గదిని కేటాయించిన వ్యక్తికి.. ఆ తర్వాత 30 రోజుల వరకు తిరిగి గదిని కేటాయించరు. అలాగే ఒంటరి వ్యక్తికి, వివాహం కాని వారికి గదులు కేటాయించరు. ఇక ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి మాత్రమే క్యూ లైన్‌లోకి రావాలి.సీఆర్వో వద్ద రిజిస్ట్రేషన్ తర్వాత..మరోవైపు రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత.. సీఆర్వో వద్ద ఉన్న డిస్‌ప్లే బోర్డులలో వరుస క్రమంలో రిజిస్ట్రేషన్ సంఖ్య ప్రదర్శిస్తారు. అనంతరం 15 నిమిషాలలోపు భక్తుల సెల్ ఫోన్‌కు కేటాయించిన గది సమాచారం మెసేజ్ రూపంలో వస్తుంది. డిస్ ప్లే బోర్డుల్లో రిజిస్ట్రేషన్ సంఖ్య వచ్చి.. మెసేజ్ రాకపోతే సీఆర్వో వద్ద ఉన్న కీయోస్క్ మిషన్లలో అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ స్కాన్ చేస్తే కేటాయించిన గది వివరాలు తెలుస్తాయి. ఆ తర్వాత భక్తులు తమకు కేటాయించిన ప్రాంతంలోని ఉప విచారణ కార్యాలయాల వద్దకు వెళ్లి ఆన్ లైన్ ద్వారా రుసుమును చెల్లించి తాళాలు తీసుకోవాల్సి ఉంటుందని టీటీడీ తెలిపింది.తిరుమలలో గదులు పొందిన భక్తులు పాటించాల్సిన నిబంధనలుతిరుమలలో 24 గంటలకు మాత్రమే టీటీడీ గదులు కేటాయిస్తుంది. 24 గంటలు దాటిన పక్షంలో టారిఫ్ 200 శాతం, 48 గంటలు దాటితే టారిఫ్ 400 శాతం పెరుగుతుంది. భక్తులు నీరు, విద్యుత్ వృధా చేయరాదని.. ప్లాస్టిక్ బాటిల్స్ ఉపయోగించవద్దని టీటీడీ కోరింది. భక్తులు వారి వస్తువులను వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాగే గదులు పొందిన వారు మాత్రమే గది ఖాళీ చేయాల్సి ఉంటుంది. లేకుంటే కాషన్ డిపాజిట్ తిరిగి ఇవ్వరు.