ఒకవైపు.. అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ వ్యవహారం దుమారం రేపుతుండగా.. తాజాగా మరో సంఘటన చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం, చార్‌ధామ్‌ యాత్రలో ముఖ్యమైన బద్రీనాథ్ ఆలయంలో భక్తులు సమర్పించిన విరాళాల చోరీ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆలయ హుండీలోని నగదు, నగలు, ఇతర విలువైన కానుకలను లెక్కించే సమయంలో అక్రమాలు జరిగినట్లు వెలుగులోకి రావడంతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) విచారణను ముమ్మరం చేసింది. తాజాగా ఆలయ మాజీ అధికారి, లెక్కింపు కేంద్రం ఇన్‌ఛార్జిగా పనిచేసిన రాజేంద్ర చౌహాన్‌ను సిట్ అధికారులు అరెస్టు చేయడం కేసులో కీలక మలుపుగా మారింది.దర్యాప్తులో భాగంగా పరిశీలించిన సీసీటీవీ ఫుటేజీల్లో రాజేంద్ర చౌహాన్ పలుమార్లు రూ.500 నోట్ల కట్టలను తన జేబుల్లో దాచుకున్నట్లు స్పష్టంగా కనిపించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఇదే కేసులో ప్రమోద్ నౌతియాల్‌ను కూడా అరెస్టు చేసిన సిట్ అధికారులు.. అతడు కేవలం నగదు మాత్రమే కాకుండా బంగారు, వెండి నాణేలు, భక్తులు సమర్పించిన కుంకుమపువ్వు ప్యాకెట్లను కూడా తీసుకెళ్తున్న దృశ్యాలను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం బయటపడిన వెంటనే బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ప్రమోద్‌ను విధుల నుంచి తొలగించింది.ఈ కేసులో మిస్సింగ్ సీసీటీవీ ఫుటేజీ మరో కీలక అంశంగా మారింది. ఆలయ కమిటీ వద్ద మొత్తం 45 రోజుల రికార్డింగ్ అందుబాటులో ఉందని మొదట సమాచారం ఇచ్చినప్పటికీ.. ఇప్పటివరకు సిట్ అధికారులకు కేవలం 13 రోజుల ఫుటేజీ మాత్రమే అందింది. మిగిలిన 32 రోజుల వీడియో రికార్డులు ఎక్కడికి వెళ్లాయనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఫుటేజీలో మరిన్ని అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఉండే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు.ఈ చోరీ దర్యాప్తు సందర్భంగా స్వాధీనం చేసుకున్న విదేశీ కరెన్సీ, కుంకుమపువ్వు వంటి వస్తువులకూ ఈ కేసుతో సంబంధం ఉందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. లెక్కింపు కేంద్రంలో పనిచేసిన మరికొందరు ఉద్యోగుల పాత్రపైనా సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. చార్‌ధామ్ యాత్రలో అత్యంత పవిత్రమైన బద్రీనాథ్ ఆలయంలో విరాళాల చోరీ వెలుగులోకి రావడం భక్తుల్లో తీవ్ర ఆందోళనకు గురిచేసింది. మిస్సింగ్ సీసీటీవీ ఫుటేజీ లభిస్తే ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.