: నీట్ పరీక్ష పేపర్ల లీకేజీపై జంతర్ మంతర్ వేదికగా గత మూడు వారాలుగా నిరంతరాయంగా నిరాహార దీక్ష చేస్తున్న 59 ఏళ్ల సోనమ్ వాంగ్‌చుక్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం తెల్లారుజామున ఆస్పత్రికి తరలించారు. ముఖ్యంగా దీక్షా స్థలి నుంచి తీసుకెళ్లి సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. నిరంతర దీక్ష కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించి, క్లిష్ట దశకు చేరుకుందని, నిపుణులైన వైద్యుల సలహా మరియు ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారమే ఆయనకు అవసరమైన వైద్య సంరక్షణ అందించడానికి ఆసుపత్రికి తరలించామని పోలీసులు స్పష్టం చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న వాంగ్‌చుక్ భార్య గీతాంజలి జె ఆంగ్మో.. తన భర్తకు చికిత్స చేయొద్దని చెప్పారు. తన అనుమతి లేకుండా ఏం చేసినా ఊరుకోనని వివరించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.నా అనుమతి లేనిదే చికిత్స వద్దు: గీతాంజలి డిమాండ్ భార్య గీతాంజలి జె ఆంగ్మో ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. "నేను ప్రస్తుతం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఉన్నాను. గత 20 రోజులుగా నా భర్త ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న మా వ్యక్తిగత వైద్యులు, కుటుంబ సభ్యులు, నా అనుమతి లేకుండా ఆయనకు నోటి ద్వారా గానీ, సెలైన్ రూపంలో గానీ ఎలాంటి మందులు, చికిత్స ఇవ్వడానికి వీళ్లేదు. నిన్నటి వరకు ఆయన చాలా ఆరోగ్యంగా, బాగానే కనిపించారు. ఆయన్ను అర్ధాంతరంగా ఆసుపత్రికి తీసుకు రావాల్సిన అవసరమే లేదు" అని ఆమె పేర్కొన్నారు. ఆర్టికల్ 32 ప్రకారం ఇది తమ ప్రాథమిక హక్కు అని నిలదీసిన ఆమె.. తమ సొంత వైద్యుడి పర్యవేక్షణ లేకుండా ఎలాంటి చికిత్స ప్రారంభించినా, ఒకవేళ ఆయనకు ఏమైనా జరిగితే దానికి ప్రతి ఒక్కరినీ బాధ్యులను చేస్తానని హెచ్చరించారు.తగ్గని వాంగ్‌చుక్ ధీమా.. పార్లమెంట్ మార్చ్‌కు పిలుపుగత 20 రోజులుగా సాగుతున్న కఠిన దీక్ష కారణంగా సోనమ్ వాంగ్‌చుక్ సుమారు 9 కిలోల బరువు తగ్గారని వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికీ.. ఆయన మాత్రం తన పట్టు వీడటం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన స్పందన రాకుండా దీక్షను విరమిస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన భావిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే జూలై 20వ తేదీన 'కాక్రోచ్ జనతా పార్టీ' ఆధ్వర్యంలో చేపట్టనున్న పార్లమెంట్ మార్చ్‌ను విజయవంతం చేయాలని ఆయన శుక్రవారం రాత్రి తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "బాహ్యంగా నా శరీరం బలహీనపడినా, అంతర్గతంగా నేను చాలా బలంగా ఉన్నాను. మన ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌లో మన విజ్ఞప్తిని వినిపించడానికి జూలై 20న అందరం కలిసి శాంతియుతంగా ముందుకు సాగాలి. జూలై 20 వరకు నేను ఎలాగైనా ప్రాణాలతో ఉంటాను. ఒకవేళ మీరంతా రాకపోయినా.. ఆ రోజు మార్చ్ విజయవంతం కాకపోయినా.. నేను దయ్యంగానైనా తిరిగి వస్తాను" అని కాస్త సరదాగా వ్యాఖ్యానించారు.