ధర్మవరం, పుట్టపర్తి మీదుగా బుల్లెట్‌ రైలు.. రూటు మారింది, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ మీదుగా రెండు బుల్లెట్ రైళ్లు పరుగులు పట్టాలెక్కనున్నాయి. హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై వయా అమరావతి బుల్లెట్ రైళ్లకు కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ టు బెంగళూరు బుల్లెట్ రైలు రాయలసీమ మీదుగా.. హైదరాబాద్ టు చెన్నై బుల్లెట్ రైలు కోస్తా మీదుగా నడుస్తుంది. అయితే హైదరాబాద్ టు బెంగళూరు బుల్లెట్ రైలు అలైన్‌మెంట్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసకొచ్చింది. ఈ బుల్లెట్ రైలు శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం, పుట్టపర్తి మీదుగా నడిచేలా మార్పులు చేయాలని కోరుతున్నారు. తాజా ప్రతిపాదనలపై అమరావతిలోని సచివాలయంలో ఇటీవల ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్‌ (నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) అధికారులతో జరిగన సమావేశంలో చర్చకు వచ్చింది. హైదరాబాద్‌- బెంగళూరు కారిడార్‌పై చేస్తున్న ఎఫ్‌ఎల్‌ఎస్‌ (ఫైనల్‌ లొకేషన్‌ సర్వే), డీపీఆర్‌ తయారీలో ఈ మార్పులు చేయాలని కోరారు. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం రైల్వే బోర్డ్‌ ఛైర్మన్‌కు కూడా లేఖ రాయడంతో ఈ మార్పుల్ని ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్‌ పరిగణలోకి తీసుకుంటుందని చెబుతున్నారు. వాస్తవానికి గతంలో ప్రతిపాదించిన అలైన్‌మెంట్ ప్రకాశం అనంతపురం హిందూపురం మధ్య దుద్దేబండ దగ్గర కియా పరిశ్రమ కోసం రైల్వే స్టేషన్‌ ప్లాన్ చేశారు. ముందు ప్రతిపాదనలకు బదులు ధర్మవరం, పుట్టపర్తి మీదుగా అలైన్‌మెంట్ మార్చి.. రెండు చోట్లా స్టేషన్లు నిర్మిస్తే బావుంటుందని ప్రతిపాదించారు. పుట్టపర్తి సత్యసాయి కోసం దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు.. వారు బెంగళూరు, హైదరాబాద్ నుంచి పుట్టపర్తికి చేరుకోవడానికి ఈజీగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే పుట్టపర్తి దగ్గర యుద్ధవిమానాల తయారీ ప్రాజెక్ట్‌ సహా కొన్ని పరిశ్రమలు రాబోతున్నాయి కాబట్టి వాటికి కూడా ఉపయోగంగా ఉంటుందంటున్నారు. అటు పుట్టపర్తికి దగ్గరలో కియా పరిశ్రమకు 20 కిలోమీటర్ల దూరంలోనే రైల్వే స్టేషన్ ఉంటుంది. అందుకే ఈ మార్పులు చేయాలని ప్రభుత్వం కోరింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు మొత్తం 597 కిలోమీటర్ల మేర బుల్లెట్ రైలు కోసం మేర హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మించనున్నారు. ఏపీలో 264 కి.మీ., తెలంగాణలో 239 కి.మీ, కర్ణాటకలో 94 కి.మీ దూరం ఉంది. హైదరాబాద్‌- కర్నూలు- అనంతపురం- బెంగళూరు జాతీయ రహదారికి సమాంతారంగా ప్లాన్ చేశారు. ముందు అనుకున్న అలైన్‌మెంట్ ప్రకారం.. ఏపీలోని కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, కియా దగ్గర దుద్దేబండ, హిందూపురంలో రైల్వే స్టేషన్లు నిర్మించాలని ప్లాన్ చేశారు. అనంతపురం నుంచి హిందూపురం 90 కిలోమీటర్ల దూరంలో ఉంది.. మధ్యలో కియాకు సమీపంలో దుద్దేబండ దగ్గర స్టేషన్ ఏర్పాటుచేయాలనుకున్నారు. తాజాగా అనంతపురం నుంచి ధర్మవరం, పుట్టపర్తి మీదుగా హిందూపురం వైపు వెళ్లేలా ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. కొత్త అలైన్‌మెంట్ ప్రకారం చూస్తే.. అనంతపురం టు హిందూపురం 102.1 కి.మీ ఉంటుంది. ముందు ప్రతిపాదించిన అలైన్‌మెంట్ కంటే11.4 కి.మీ. మాత్రమే పెరుగుతుందని చెబుతున్నారు.