హెచ్ఎండీఏలో భారీ అవినీతి తిమింగలం.. చీఫ్ ఇంజినీర్‌కు రూ.100 కోట్ల ఆస్తులు, ఏసీబీ అరెస్ట్

Wait 5 sec.

హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చీఫ్ ఇంజినీర్ బచ్చు రవీందర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం భారీ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని ఆయన ఇళ్లు, ఆఫీసులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లతో కలిపి మొత్తం 10కుపైగా ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఏసీబీ అధికారులు చేసిన ఈ దాడుల్లో బచ్చు రవీందర్‌కు సంబంధించి.. భారీ స్థాయిలో స్థిర, చరాస్తులను గుర్తించారు. సోదాల తర్వాత బచ్చు రవీందర్‌ను అరెస్ట్ చేసి ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సోదాల్లో సుమారు అర కిలో బంగారం, కిలోన్నర వెండి వస్తువులు, రూ.4 లక్షల నగదు, రూ.10 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, 18 విదేశీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో 4 బ్యాంక్ లాకర్లను గుర్తించి వాటిని ఫ్రీజ్ చేశారు. ప్రభుత్వ విలువ ప్రకారం ఆస్తులు రూ.9.24 కోట్లకు పైగా ఉండగా.. వాటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.100 కోట్లకు మించి ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ ఏసీబీ సోదాల్లో బచ్చు రవీందర్ పేరిట మసీద్‌బండలో 4 ఫ్లోర్ల బిల్డింగ్.. శంషాబాద్-షాబాద్ పరిధిలో 4 ఎకరాల వ్యవసాయ భూమి.. శంకర్‌పల్లి, కిష్టాపూర్ ప్రాంతాల్లో భూములు.. కొండాపూర్‌లో 2 ఫ్లాట్లు.. జడ్చర్లలో 7 ప్లాట్లు.. సుమధుర ఆక్రోపోలిస్, శ్రీవారి మెడోస్, వాసవి అట్లాంటిస్ ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు, ప్లాట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆస్తుల మూలాలు, పెట్టుబడుల వివరాలు, బ్యాంకు లావాదేవీలపై ఏసీబీ అధికారులు మరింత లోతుగా విచారణ చేపట్టారు.బచ్చు రవీందర్‌పై ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు కేసు నమోదు చేసిన ఏసీబీ.. స్వాధీనం చేసుకున్న పత్రాలు, బ్యాంక్ రికార్డులు, లాకర్ల వివరాలను విశ్లేషిస్తోంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత అక్రమాస్తుల అసలు విలువ, ఇతర అక్రమాలపై మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అవినీతి అధికారులు చిట్టా విప్పుతున్న ఏసీబీ అధికారులు.. ఇలాంటి అవినీతి తిమింగలాలను అరెస్ట్ చేసి.. జైళ్లకు పంపుతున్నారు.