‘ప్లీజ్ నన్ను మరింత బాధపెట్టకండి’.. జానకమ్మ అంత్యక్రియలకు వెళ్లకపోవడంపై సింగర్ శ్వేతా మోహన్ ఆవేదన

Wait 5 sec.

దిగ్గజ గాయని జానకమ్మ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మరణం భారతీయ సంగీత లోకాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. స్వర సామ్రాజ్ఞి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఆదివారం సాయంత్రం ముగిశాయి. కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆమెకు కడసారి వీడ్కోలు పలికారు. అయితే జానకమ్మకు ఆప్తురాలైన ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దీనిపై తాజాగా శ్వేతా మోహన్ స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. జానకి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో తాను లండన్‌లో మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా లైవ్ కన్సర్ట్‌లో ఉన్నట్లు శ్వేతా మోహన్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. ''జానకమ్మ అంత్యక్రియల సమయంలో నేను ఎందుకు కనిపించలేదని చాలా మంది నన్ను అడుగుతున్నారు. దానికి కారణం, అప్పుడు నేను లండన్‌లో రాజా సార్ కచేరీలో ఉన్నాను. ఆమె మనల్ని విడిచిపెట్టిన కొద్ది గంటలకే, ఆమెకు సంగీతపరమైన నివాళి అర్పించే అదృష్టం మా బృందానికి దక్కింది. ఆమెను చివరిసారిగా చూసి ఆశీర్వాదం తీసుకోలేకపోవడం నాకు ఎంతో బాధ కలిగించే విషయం. మనసు శూన్యమైపోయిన స్థితిలో, ఆమె పాడిన అద్భుతమైన పాటలను పాడాల్సిన బాధ్యతను పూర్తి చేయడానికి ప్రయత్నించడం.. ప్రతి చరణం పాడుతున్నప్పుడు ఆ చేదు వాస్తవం మరింత బలంగా మనసును తాకుతూ వచ్చింది''''ప్రతి విషయాన్ని స్పష్టంగా చెబితేనే అర్థం చేసుకుని, 'మెచ్చుకునే' (ఇక్కడ నేను మెప్పును కోరుకోవడం లేదు) ఈ రోజుల్లో.. నేను ఎందుకు వెళ్లలేకపోయానో నిజాయితీగా అడిగిన వారందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అంబులెన్స్‌లో ఉన్న అమ్మను నేను వీడియో కాల్ ద్వారా చూశాను. ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నాను. మా మిత్రులు రాము ద్వారా అది సాధ్యమైంది. ఆమె హృదయంలో నాకు ఒక ప్రత్యేక స్థానం ఉందని నాకు తెలుసు, అలాగే నా హృదయంలో ఆమె స్థానం ఎప్పటికీ అలాగే నిలిచి ఉంటుంది. ఇక, ఎగతాళి ధోరణితో నన్ను ప్రశ్నించిన వారందరికీ ఒక విన్నపం. ఇది ఎమోషనల్ గా చాలా కఠినమైన సమయం. కాబట్టి, దయచేసి నన్ను మరింత బాధపెట్టకండి'' అని శ్వేతా మోహన్ అన్నారు. ఈ సందర్భంగా ఇళయరాజా కన్సర్ట్‌లో జానకమ్మకు నివాళులు అర్పిస్తున్న వీడియోని పంచుకున్నారు. జానకి మరణించిన రోజు కూడా శ్వేతా మోహన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ''నా రాణి జానకిమ్మ ఇక లేరు... నా హృదయంలో ఒక భాగాన్ని, నా సంగీత ఆత్మలో ఒక అంశాన్ని కోల్పోయాను. నేను ఆమెను ఎంతో ప్రేమించేదాన్ని. నా సంగీత ప్రయాణంలోని ప్రతి రోజులోనూ ఆమె ఉన్నారు. ఆమె పాటలు, ఆమె గానం నాకు ఒక 'పాఠ్యపుస్తకం' లాంటివి. వాటి నుండే నేను ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. ఈ ప్రపంచం చూసిన అత్యుత్తమ గాయనిగా నేను ఆమెను భావిస్తాను. మళ్ళీ చెబుతున్నాను.. ఈ ప్రపంచం చూసిన అత్యుత్తమ గాయని ఆమె... గాత్రంతో ఆమె చేయలేనిది ఏదీ లేదు. పాట పాడటానికి, మన హృదయాలను ఏలడానికి జన్మించిన సాటిలేని మేధావి ఆమె''''వ్యక్తిత్వ పరంగా కూడా ఆమెను నేను ఎంతో ఆరాధించేదాన్ని. తన చుట్టూ ఉన్నవారందరితో ఆమె ఒక తల్లిలా వ్యవహరించే తీరు అద్భుతం. ఆమె ఎప్పుడూ నిజాయితీగా, స్వచ్ఛంగా, ప్రేమపూర్వకంగా, పరిణతితో, ప్రశాంతంగా, దృఢ సంకల్పంతో, అందరికీ అందుబాటులో ఉంటూ, ఎంతో సాదాసీదాగా ఉంటూనే... తనదైన రాజసాన్ని (రాణిలాంటి హుందాతనాన్ని) ప్రదర్శించేవారు. గత రెండేళ్లుగా 'ఎస్. జానకి - ది కంపోజర్' ప్రాజెక్ట్ కోసం ఆమెతో కలిసి పనిచేసే గొప్ప అదృష్టం నాకు దక్కింది. అందులో, ఆమె స్వయంగా స్వరపరిచి, సాహిత్యం అందించిన నాలుగు పాటలను పాడే అవకాశం నాకు ఇచ్చారు. ఆ ప్రక్రియలో నేను ఎంతో నేర్చుకున్నాను, అలాగే అమ్మతో భావోద్వేగపరంగా ఎంతో దగ్గరయ్యాను''''ఈ బాధ నుండి నేను ఎప్పటికీ కోలుకోగలనని అనుకోవడం లేదు. ఆమె ఇక లేరన్న వార్త విన్న తర్వాత ఈ రోజు కచేరీలో పాడటం చాలా కష్టంగా అనిపించింది. కానీ, ఈ బాధను ఆమె జీవితం, ఆమె కృషిని సంబరంగా జరుపుకునేలా మలుచుకోవడం నేర్చుకుంటాను. ఆమె ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి, జానకమ్మ'' అని శ్వేతా మోహన్ పేర్కొన్నారు. జానకితో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నారు.