అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మరో భారత సంతతి వ్యోమగామి.. ఎవరీ అనిల్ మీనన్?

Wait 5 sec.

భారత సంతతికి చెందిన వ్యోమగామి అనిల్ మీనన్‌ తొలి అంతరిక్ష యాత్రను మొదలయ్యింది. రష్యాకు చెందిన సోయాజ్ MS-29 అంతరిక్ష నౌకలో అంతర్జాతీయ అంతరిక్ష ఆయన కేంద్రానికి బయలుదేరారు. అనిల్ మీనన్‌ మరో ఇద్దరు రష్యా వ్యోమగాములు ప్యోటర్ డుబ్రోవ్, అన్నా కికీనాలతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్నారు. కజకిస్థాన్‌లోని చారిత్రాత్మక బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు. అనిల్‌కు ఇదే తొలి అంతరిక్ష యాత్ర కాగా.. డుబ్రోవ్, కికీనాలు ఐఎస్ఎస్‌కు వెళ్లడం ఇది రెండోసారి. అక్కడ 8 నెలల పాటు పలు పరిశోధనలు అనంతరం.. ఈ ముగ్గురూ 2027లో భూమికి తిరిగి రానున్నారు.మంగళవారం రాత్రి 8.17 గంటలకు బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి ఎంఎస్-25 అంతరిక్ష నౌక బయలుదేరింది. మూడు గంటలకు పైగా ప్రయాణం తర్వాత కక్ష్య ప్రయోగశాలకు అనుసంధానం అవుతుందని భావిస్తున్నారు. మానవ శరీరం అంతరిక్ష వాతావరణానికి ఎలా అలవాటు పడుతుందో అర్థం చేసుకోవడానికి అత్యంత కీలక ప్రయోగాలలో మీనన్ బృందం పాల్గొంటుంది. అలాగే, సూక్ష్మ గురుత్వాకర్షణలో రక్త ప్రసరణ, సిరల నిర్మాణం, రక్తం కూర్పులో వచ్చే మార్పులపై అధ్యయనం చేస్తారు. దీర్ఘకాలిక అంతరిక్ష ప్రయాణాల్లో వ్యోమగాముల ఆరోగ్యం కాపాడటానికి ఈ ప్రయోగం ఎంతో కీలకం.భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడికి చేపట్టే సుదీర్ఘకాల యాత్రలకు అత్యంత కీలకమైన ఆవిష్కరణగా నిరూపించే ఐఎస్ఎస్‌లోని తాగునీటిని ఉపయోగించి సిరల ద్వారా ద్రవాలను ఉత్పత్తి చేసే ప్రక్రియ పరీక్షలోనూ మీనన్ సహాయపడతారు. వ్యోమగాములకు ఉపయోగపడే ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించే అల్ట్రాసౌండ్ ప్రక్రియలతో సహా అధునాతన వైద్య, సాంకేతిక ప్రయోగాల్లోనూ కూడా ఆయన పాల్గొంటారని నాసా తెలిపింది.ఎవరీ అనిల్ మీనన్?కేరళలోని పాలక్కడ్‌కు చెందిన శంకరన్ మీనన్ అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అక్కడ ఉక్రెయిన్ మహిళ ఎలిజబెత్ సమోయ్లెంకోను వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడే అనిల్ మీనన్. మెడిసిన్‌తో పాటు న్యూరోబయాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్‌లోనూ అనిల్ డిగ్రీలు చేశారు. అనంతరం ఆరోగ్య సంరక్షణ, అంతరిక్ష పరిశోధన రంగాల కలయికలో తన వృత్తిని నిర్మించుకున్నారు. స్పేస్ ఫోర్స్‌లో ఎమర్జెన్సీ మెడిసిన్ ఫిజీషియన్‌గా, పైలట్‌గా రాణించిన అనిల్.. నాసా వ్యోమగాముల బృందంలో చోటు దక్కించుకున్నారు.వైమానిక దళంలో పనిచేసినప్పుడు అఫ్గనిస్థాన్‌లో అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్‌లో ఫ్రంట్‌లైన్ సేవలందించారు. హిమాలయన్ రెస్క్యూ అసోసియేషన్ తరపున ఎవరెస్ట్‌ శిఖరంపై పర్వతారోహకులకు సంరక్షణ అందించారు. రోటరీ అంబాసిడోరియల్ స్కాలర్‌గా పోలియో టీకా కార్యక్రమాల అధ్యయనం, మద్దతు కోసం భారత్‌లో ఏడాది పాటు గడిపారు.2014లో నాసాలో ఫ్లైట్ సర్జన్‌గా, 2018లో స్పేస్‌ఎక్స్‌లో సేవలు అందించారు. ఆ సంస్థ మొదటి మానవ అంతరిక్ష యాత్ర సన్నాహాలకు సహాయం అందించారు. జాబిల్లి, అంగారక సహ ఇతర అంతరిక్ష యాత్రలు చేపట్టేందుకు ఉద్దేశించిన సూపర్ హెవీ రాకెట్ స్టార్‌షిప్ అభివృద్ధిలో అనిల్ మీనన్ కీలకంగా వ్యవహరించారు.డిసెంబర్ 2021లో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. మీనన్ అన్నా విల్‌హెల్మ్ కూడా ఒక వ్యోమగామి. ఆమె సెప్టెంబర్ 2024లో స్పేస్‌ఎక్స్ చేపట్టిన యాత్రలో దాదాపు ఐదు రోజుల పాటు అంతరిక్షంలోకి ప్రయాణించారు.