పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం.. మొదటి లిఫ్ట్‌లో మోటార్ వెట్ రన్ సక్సెస్.. 22 నెలల తర్వాత..!

Wait 5 sec.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐఎస్)లో కీలక ముందడుగు పడింది. గత రెండు రోజులుగా ఉత్కంఠ రేపిన సాంకేతిక సమస్యలను అధిగమించిన అధికారులు.. నార్లాపూర్ మొదటి లిఫ్ట్ పరిధిలోని తొలి పంపు వెట్‌రన్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. దీంతో నార్లాపూర్ రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను ఎత్తిపోసే ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది. దీంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పురోగతిలో ఇది మరో కీలక మైలురాయిగా నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.ఇటీవల తొలి పంపు వెట్‌రన్ నిర్వహించే సమయంలో పవర్ ట్రిప్పింగ్ వంటి సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. డ్రై రన్ సక్సెస్ అయినప్పటికీ.. వెట్‌రన్ మాత్రం సఫలం కాలేదు. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, ఏజెన్సీ ప్రతినిధులతో కూడిన ప్రత్యేక టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగి లోపాలను గుర్తించి రాత్రింబవళ్లు శ్రమించింది. సమస్యలను పూర్తిగా పరిష్కరించిన తర్వాత మళ్లీ పంపును ప్రారంభించగా ఎలాంటి అంతరాయం లేకుండా వెట్‌రన్ సక్సెస్ అయింది.దీంతో దాదాపు 22 నెలల సుదీర్ఘ విరామం తర్వాత పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని తొలి పంపు తిరిగి విజయవంతంగా పనిచేయడం విశేషం. నార్లాపూర్ మొదటి లిఫ్ట్‌లో మొత్తం 4 పంపులను వెట్‌రన్‌కు సిద్ధం చేసిన అధికారులు.. వారానికి ఒక పంపు చొప్పున మిగిలిన 3 పంపుల ట్రయల్స్ నిర్వహించాలని నిర్ణయించారు. అన్ని పంపుల వెట్‌రన్ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో నీటి ఎత్తిపోతలు ప్రారంభించే అవకాశం ఉంది.మొదటి లిఫ్ట్ నుంచి ఎల్లూరు జలాశయానికి నీటిని ఎత్తిపోస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాకు తాగునీటి అవసరాలు తీర్చవచ్చని ప్రభుత్వ నీటిపారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి తెలిపారు. కాల్వల పనులు పూర్తి అయిన తర్వాత కర్వెన వరకు జలాశయాలను నింపే అవకాశం ఉంటుందని చెప్పారు. రెండు, మూడు, నాలుగో పంపులు కూడా రెడీగా ఉన్నాయని.. ఎస్‌ఈ రవీందర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నార్లాపూర్ రిజర్వాయర్‌ను నింపేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్యాకేజీ-3 పనులు డిసెంబర్‌లోపు పూర్తి చేసి.. ఏదుల పంప్ హౌస్‌లోని 4 పంపులకు సెప్టెంబర్ నుంచి వెట్‌రన్ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.