ఫ్యూచర్ సిటీ-అమరావతి-బందరు పోర్టుకు 12 లేన్ల హైవే.. హైదరాబాద్-విజయవాడ మధ్య తగ్గనున్న 100 కి.మీ.ల దూరం

Wait 5 sec.

తెలంగాణలో రహదారి మౌలిక వసతుల అభివృద్ధికి వేగం తీసుకురావడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కీలక అడుగులు వేస్తున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రతిష్టాత్మక రహదారి ప్రాజెక్టులపై చర్చించారు. ముఖ్యంగా హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్)కు అవసరమైన అనుమతులు త్వరగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ నుంచి అమరావతి వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్రం అనుమతులు ఇవ్వాలని కోరారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు 12 లేన్ల హైవే నిర్మిస్తే హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రయాణ దూరం సుమారు 100 కిలోమీటర్లు తగ్గుతుందని వివరించారు. దీంతో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు సరుకు రవాణా మరింత వేగవంతమవుతుందని తెలిపారు.ఈ హైవే నిర్మాణం పూర్తయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పారిశ్రామిక అనుసంధానం మరింత బలోపేతం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా బందరు పోర్టుకు సరుకు రవాణా వేగంగా సాగడంతో ఎగుమతులు, దిగుమతులు సులభతరం అవుతాయని, రెండు రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వివరించారు.మన్ననూరు-శ్రీశైలం ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్‌కు అటవీ శాఖ నుంచి రావాల్సిన అనుమతులను కూడా కేంద్రం తొందరగా మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. నల్లమల అడవులు, శ్రీశైలం, జలాశయాల పరిధిలో ఈ మన్ననూరు-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు ఉండటంతో కేంద్ర ప్రభుత్వం సాయం కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మరోవైపు.. రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా హైదరాబాద్- మంచిర్యాల మధ్య 6 వరుసల జాతీయ రహదారి మంజూరు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్-మంచిర్యాల నేషనల్ హైవే ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణను తామే చేపడతామని ముఖ్యమంత్రి తెలిపారు.