అలాంటి కోరికలతో గాంధీభవన్‌ చుట్టూ తిరగొద్దు.. వారికి అపాయింట్‌మెంట్లు ఇవ్వొద్దు: సీఎం రేవంత్

Wait 5 sec.

పార్టీ శ్రేణుల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అత్యంత కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. పార్టీ పదవులు, నామినేటెడ్ ఛైర్మన్‌ పోస్టుల కోసం గాంధీ భవన్‌కు వచ్చే నాయకులకు ఎలాంటి అపాయింట్‌మెంట్లు ఇవ్వొద్దని ఆయన పార్టీ ముఖ్య నేతలను సూచించారు. సర్‌ - SIR ప్రక్రియపై నిర్వహించిన జూమ్‌ వర్చువల్ సమావేశంలో సీఎం ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపటి నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు నేతలెవ్వరూ హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు రావొద్దని స్పష్టం చేశారు. కొంతమంది నాయకులు నియోజకవర్గాలను వదిలేసి హైదరాబాద్‌లోనే తిష్టవేసి పనిచేయకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సర్‌ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించినందున ఇన్‌ఛార్జి మంత్రులు ఆయా జిల్లాల్లో క్షేత్రస్థాయి సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఇప్పటివరకు 489 భేటీలు జరిగాయని, వెనుకబడిన నియోజకవర్గాల్లోని నేతలు ఇప్పటికైనా నిద్రలేచి స్పందించాలని సీఎం పిలుపునిచ్చారు. పార్లమెంట్‌ సమావేశాల్లో ఉన్న ఎంపీలు సైతం తమ నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని ఇన్‌ఛార్జిలుగా ఉన్న చోట ఎంపీలు సరిగ్గా పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. బూత్ లెవెల్ ఆఫీసర్ల నివేదికల కంటే పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించాలని కేవలం అధికారుల నివేదికలపై ఆధారపడితే సహించేది లేదని స్పష్టం చేశారు.నాయకులెవరూ హైదరాబాద్‌ చుట్టూ తిరుగుతామంటే కుదరదని, రాబోయే 10 రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో ప్రతీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాలని సీఎం ఆదేశించారు. సర్‌ ప్రక్రియ విజయవంతం చేయడానికి పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరింత బాధ్యత తీసుకుని సమన్వయం చేయాలన్నారు. ఈనెల 30న దీనిపై మళ్లీ పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. కాగా, క్షేత్రస్థాయిలో అద్భుతంగా పనిచేసి ప్రతిభ కనబరిచే 100 మంది ఉత్తమ బీఎల్‌ఏలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీతో నేరుగా ఫొటో దిగే అరుదైన అవకాశం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారు.