ఫీజుల కట్టడికి కొత్త చట్టం.. ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ ఆదేశాలు

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు, పారదర్శకతను పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత 2026-27 విద్యా సంవత్సరంలో ఆయా స్కూళ్లు వసూలు చేస్తున్న ట్యూషన్ ఫీజు వివరాలను తరగతుల వారీగా పాఠశాల నోటీసు బోర్డుల్లో, అలాగే వారి అధికారిక వెబ్‌సైట్లలో స్పష్టంగా ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ శనివారం కఠిన ఆదేశాలు జారీ చేశారు.ఫీజుల వివరాల ప్రదర్శనతో పాటు.. గత రెండేళ్లకు (2023-24, 2024-25) సంబంధించిన వార్షిక పరిపాలనా నివేదికలను, చార్టర్డ్ అకౌంటెంట్ ధ్రువీకరించిన ఆడిట్ రిపోర్టులను ఈ నెల 30వ తేదీలోపు విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 1994లో జారీ చేసిన జీవో నంబర్ 1 ప్రకారం ఏటా ఆడిట్ నివేదికలు ఇవ్వడం నిబంధన అయినప్పటికీ.. గతంలో దీనిపై పర్యవేక్షణ లోపించింది. అయితే ఈసారి మాత్రం నివేదికలు ఇవ్వని స్కూళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి.. కఠిన చర్యలు తీసుకోవాలని డీఈవోలు, ఆర్‌జేడీలను విద్యాశాఖ ఆదేశించింది.2027-28 నాటికి ఫీజు నియంత్రణ చట్టం?రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 12 వేల ప్రైవేట్ పాఠశాలల్లో ఏటా ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతుండటంతో తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావడానికి కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే సిద్ధమైన ముసాయిదా బిల్లు ప్రకారం.. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి కేవలం 8 శాతం మాత్రమే ఫీజు పెంచుకునే వెసులుబాటు ఉంటుంది.త్వరలోనే ఈ ముసాయిదాపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి.. కేబినెట్‌ భేటీలో చర్చించిన తర్వాత అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టనున్నారు. వచ్చే 2027-28 విద్యాసంవత్సరం నాటికి ఈ ఫీజు నియంత్రణ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తేవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత విద్యాశాఖ చర్యలు ప్రైవేట్ పాఠశాలల్లో జవాబుదారీతనాన్ని పెంచుతాయని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.