కస్తూర్భా గాంధీ పాఠశాలలో ఓ ఘటన చోటుచేసుకుంది. పిల్లలు, సిబ్బంది అందరూ కూర్చుని ఉండగా వాళ్లకి టీ అందించారు. అదే సమయంలో ఓ ప్రత్యేకమైన జగ్గులో ఇంకోసారి టీ రావడం.. వాటిని పీఈటీ, సెక్యూరిటీ గార్డు ఇద్దరూ తాగడంతో వారిద్దరూ అస్వస్థతకు గురయ్యారు. తోటమాలే ఈ పని కావాలని చేసిందని పీఈటీ ఆరోపిస్తుండగా, తనకేం సంబంధం లేదంటూ తోటమాలి అంటోంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పొన్నాడ కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలం పొన్నాడ కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీలో) మంగళవారం ఉదయం అందరూ కూర్చున్నారు. అదే సమయంలో సిబ్బంది కూడా అక్కడే ఉండటంతో వంటగది నుంచి పిల్లలు, సిబ్బంది కోసం టీ తీసుకొచ్చారు. కొంతసేపటి తర్వాత ఓ ప్రత్యేక జగ్గులో ఉన్న టీని పీఈటీ సన్యాసమ్మ, సెక్యూరిటీ గార్డు టి. ఉష తాగారు. టీ తాగుతున్న సమయంలో వాసన ఏదో తేడాగా ఉండటంతో పీఈటీ కొంచెమే తాగి పారబోశారు. READ ALSO అందులో ఈగల మందు కలిసి ఉండటంతో పీఈటీ, సెక్యూరిటీ గార్డు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అస్వస్థతకు గురైన ఆ ఇద్దర్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కేజీబీవీలో తోటమాలిగా పనిచేస్తున్న ఓ మహిళ రెండు రోజుల కిందట కిచెన్‌లో పాలు తీసుకెళ్తుండగా పీఈటీ సన్యాసమ్మ చూసింది. అలా చేయడం తప్పంటూ తోటమాలిని మందలించారు. ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకునే అందరికీ ఒకలా, తనకు మరోలా టీ చేసుకుని వచ్చి.. అందులో ఈగల మందు కలిపారంటూ పీఈటీ ఆరోపించారు. ఈ ఘటనపై ప్రిన్సిపాల్ సూర్యకళ మాట్లాడుతూ ఈగల మందు కలిపిన టీ తాగడంతోనే సిబ్బంది అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. అయితే, ఈగల మందు తాను కలపలేదంటూ తోటమాలి చెప్పిందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. అయితే, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిక చేస్తామని, దీనిపై చర్యలు కూడా తీసుకుంటామని సూర్యకళ తెలిపారు.