తిరుమల శ్రీవారిని ఓ కోరిక కోరుకున్న మూడు రోజులకే అద్భుతం జరిగిందన్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఇంతకముందు తాను తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చానని.. అప్పుడు రాజ్యసభ ఎన్నికలు అవ్వలేదని గుర్తు చేశారు. ఆ రోజు తాను మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సమయంలో.. తాను ఏం కోరిక కోరుకున్నారని అడిగారని.. తన కుమారుడు విజయ్‌కు రాజ్యసభ సీటు ఇవ్వమని కోరుకున్నాను, మొక్కుకున్నానన్నారు. ఆ తర్వాత తిరుమల నుంచి వెళ్లిన మూడు రోజు రాజ్యసభ సీటు వచ్చిందని.. ఆ స్వామివారి దయ, అందరి దయవల్ల పదవి దక్కిందన్నారు. స్వామివారిని కోరుకున్న మూడో రోజే రాజ్యసభ అవకాశం దక్కిందన్నారు. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.ఆంధ్రప్రదేశ్ వైల్డ్ లైఫ్ కమిటీ (ఏపీ అసెంబ్లీ వన్యప్రాణి - పర్యావరణ పరిరక్షణ అసెంబ్లీ కమిటీ)కి తాను ఛైర్మన్‌గా ఉన్నానని.. తనతో పాటుగా ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, నరేంద్ర వర్మతో పాటుగా మరికొందరు సభ్యులతో కమిటీ ఉందన్నారు. ఇప్పటికే విశాఖపట్నం జూను సందర్శించామని.. తిరుపతి జూను సందర్శించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. ఆసియాలోనే 3వేల ఎకరాల్లో ఉన్న ఏకైక జూ తిరుపతిలోనే ఉందని.. తిరుమల దర్శనానికి 90వేలమంది వరకు వస్తున్నారు జూకు మాత్రం 3వేలమంది మాత్రమే వస్తున్నారన్నారు. తిరుపతిలోని జూపార్క్‌లో సరైన సౌకర్యాలు లేకపోవడంతోనే సందర్శకులు రావడం లేదన్నారు అయ్యన్నపాత్రుడు. తిరుపతి జూ పార్క్‌ను టీటీడీ సహకారంతో అభివృద్ధి చేయొచ్చన్నారు.. జూపార్క్ కోసం టీటీడీ సహకారం కోరతామన్నారు. తిరుపతి జూను అభివృద్ధి చేస్తే.. తిరుమలకు వచ్చే భక్తుల్లో 50శాతం మంది వచ్చినా ఆదాయం వస్తుందన్నారు అయ్యన్నపాత్రుడు. జూలో నీళ్ల సమస్య ఉందని చెప్పారని.. అక్కడి సౌకర్యాలు ఎలా కల్పించాలి, నిధులు ఎలా సమకూర్చాలనే అంశంపై నివేదికను సిద్ధం చేస్తామన్నారు. కలెక్టర్‌తో కూడా సమావేశం నిర్వహించి నిధుల అంశంపై కూడా చర్చిస్తామన్నారు. తిరుపతికి వేలాదిమంది భక్తులు వస్తున్నారని.. కుటుంబంతో కలిసి సరదాగా జూకు వెళ్లి ఎంజాయ్ చేసేలా ఎలాలంటి ఏర్పాట్లు చేస్తే బావుంటుందో ఆలోచన చేస్తున్నామన్నారు .