ఫిఫా వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో ఊహించని షాకింగ్ డ్రామా నడిచింది. అయితే, రెఫరీ ఫైనల్ విజిల్ వేసిన వెంటనే, మ్యాచ్‌ను గెలిచిన ఆనందంలో అర్జెంటీనా ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుండగా, ఇంగ్లాండ్ స్టార్ మిడ్‌ఫీల్డర్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఓటమి భారంతో కోపంతో ఊగిపోయిన బెల్లింగ్‌హామ్, ఒక అర్జెంటీనా ఆటగాడి వద్దకు వెళ్లి అతడి తలపై కొట్టాడు. దీంతో మైదానంలో ఒక్కసారిగా ఉత్కంఠ, ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.నిజానికి మ్యాచ్ చివరి నిమిషం వరకు ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ నడిచింది. చివరి నిమిషాల్లో కమ్ బ్యాక్ ఇచ్చిన అర్జెంటీనా.. వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. దీంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడి, నిరాశకు గురయ్యారు. మ్యాచ్ ముగిశాక అర్జెంటీనా ఆటగాళ్ల సంబరాలు స్లెడ్జింగ్ బెల్లింగ్‌హామ్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించినట్లు తెలుస్తోంది. దీంతో సహనం కోల్పోయిన జూడ్.. అర్జెంటీనా ఆటగాడు బార్కో తలపై కొట్టాడు. బార్కో ఏదో అన్న తర్వాతే జూడ్.. కొట్టినట్లు తెలుస్తోంది.ఇది జరిగిన వెంటనే అర్జెంటీనా ఆటగాళ్లు వెంటనే బెల్లింగ్‌హామ్‌ను చుట్టుముట్టారు. దాంతో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య పెద్ద ఎత్తున తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. మైదానంలో వాతావరణం మరింత వేడెక్కడంతో వెంటనే మిగతా ఆటగాళ్లు.. కగలజేసుకుని, ఇద్దరికీ సర్ది చెప్పారు. ఇక ఇదే మ్యాచులో మెస్సీతోనూ ఓ దశలో ఇంగ్లాండ్ స్టార్ బెల్లింగ్‌హామ్ వాగ్వాదానికి దిగాడు.క్రికెట్‌లో భారత్, పాక్ మ్యాచ్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో.. ఫిఫా ప్రపంచకప్‌లోనూ అర్జెంటీనా, ఇంగ్లాండ్ మ్యాచ్‌‌కు అంతే క్రేజ్ ఉంది. ఫాక్ లాండ్ దీవుల కోసం 1982లో ఈ రెండు దేశాల మధ్య సుమారు 74 రోజుల పాటు ఘర్షణ జరిగింది. ఇంగ్లాండ్ పైచేయి సాధించడంతో.. అర్జెంటీనా సంధి కుదుర్చుకుంది. ఈ ఘర్షణల్లో ఇరు దేశాలకు చెందిన సుమారు 900 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇది గుర్తుపెట్టుకున్న అర్జెంటీనా ఆటగాళ్లు మ్యాచ్ తర్వాత 'ఫాక్ లాండ్స్ అర్జెంటీనాదే' అని రాసి ఉన్న బ్యానర్‌ను ప్రదర్శించడం గమనార్హం. దీంతో ఈ విషయంపై ఇప్పటికీ రెండు దేశాల మధ్య వైరం కొనసాగుతోందని స్పష్టమైంది.